హ‌రీశ్‌ కు చాన్స్ దొరికిందంటే అంతే మ‌రి

Update: 2017-06-24 10:16 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు - రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు స‌మ‌యం దొరికిందంటే త‌న‌ను ఇబ్బందిపెట్టిన వారికి ఎలాంటి ట్రీట్‌ మెంట్ ఇవ్వాలో బాగా తెలుసు. ఇదే రీతిలో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న హ‌రీశ్ రావు తాజాగా తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ కోదండ‌రాంపై మండిప‌డ్డారు. అమ‌ర‌వీరుల ఆశ‌యాల సాధ‌న కోసం కోదండ‌రాం ఇటీవ‌ల యాత్ర‌ త‌ల‌పెట్టారు. అయితే ఈ యాత్ర‌ను హ‌రీశ్ అనుచ‌ర ఎమ్మెల్యే అనే పేరున్న చింతా ప్ర‌భాక‌ర్‌ కు చెందిన సంగారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మొద‌లుపెట్టారు. దీంతో పాటుగా పూర్వ‌పు మెద‌క్ జిల్లాలో ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తూ తెలంగాణ స‌ర్కారుపై కోదండ‌రాం విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో కౌంట‌ర్ ఇచ్చేందుకు హ‌రీశ్ సిద్ధ‌మ‌య్యారు.

త‌ను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిద్ధిపేట‌లో హరితహారంలో భాగంగా హరీశ్ రావు మొక్కలు నాటారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతుండ‌గా కోదండ‌రాం ప్ర‌స్తావ‌న రావ‌డంతో మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు.  రాజకీయ దురుద్దేశంతోనే కోదండరాం యాత్ర చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కొన్ని రాజకీయ పార్టీలు ప్రేరేపించి కోదండరాంతో యాత్ర చేయిస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రతిపక్షాల ప్రయోజనాల కోసం కోదండరాం పని చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. మల్లన్నసాగర్‌ ను అడ్డుకుంటూ మరోవైపు నీళ్లెందుకు రాలేదంటూ ప్రశ్నించడం సరికాదని అన్నారు. కోదండరాంకు ప్రజలపై ప్రేమ ఉంటే ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నేతలను నిలదీయాలని సూచించారు. కోదండరాం ఇలాగే వ్యవహరిస్తే ప్రజల్లో ఉన్న కొద్దిపాటి విశ్వాసం కూడా పోతుందని హ‌రీశ్ రావు చెప్పారు.

60 ఏళ్లలో సాధించని అభివృద్ధిని మూడేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వం సాధించిందని హ‌రీశ్ రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు సింగూరు జలాలను మెదక్ రైతులకు ఇవ్వలేకపోయాయని గుర్తు చేశారు. కానీ తమ ప్రభుత్వం గతేడాది 40 వేల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు. 2018 నాటికి సిద్ధిపేట ప్రాంతంలో లక్ష ఎకరాలకు అదనంగా సాగునీరందిస్తామని హ‌రీశ్ రావు ప్రకటించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కోదండరాంకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి పట్టించే చర్యలను మానుకోవాలని కోదండరాంకు మంత్రి హరీశ్ రావు సూచించారు. కోదండ‌రాం తెలుసుకోలేని క్ర‌మంలో ప్ర‌జ‌లే త‌గు రీతిలో స‌రైన స‌మ‌యంలో స్పందిస్తార‌ని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News