మేన‌ల్లుడి మాట వింటే మామ‌కే పంచ్ వేసిన‌ట్లుందే?

Update: 2019-07-04 10:50 GMT
కొన్ని మాట‌లు కొంద‌రి నోట్లో నుంచి అస్స‌లు రాకూడ‌దు. స‌మ‌యం.. సంద‌ర్భానికి ఏ మాత్రం సూట్ కాని రీతిలో వ‌చ్చే మాట‌ల‌తో లేనిపోని త‌ల‌నొప్పులు ఖాయం. ఇప్ప‌టికే మేన‌ల్లుడి మీద మ‌న‌సులో ఏదో పెట్టుకొని మేన‌మామ మంత్రి ప‌ద‌విని పీకేసిన‌ట్లుగా చెవులు కొరుక్కోవ‌టం తెలిసిందే.  అంతేనా.. కేసీఆర్ మాట‌ల్లో చెప్పాలంటే.. అంత పెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టును కుర్చీ వేసుకొని మ‌రీ కూర్చొని ప‌నులు ప‌రుగులు పెట్టించిన మేన‌ల్లుడ్ని సీన్లో లేకుండా చేయ‌గ‌లిగిన స‌త్తా కేసీఆర్ మామకే చెల్ల‌న్న మాట ఈ మ‌ధ్య‌న గుస‌గుస‌ల స్థాయిని దాటేసి.. రీసౌండ్ స్థాయిలో వినిపిస్తోన్న వైనం తెలిసిందే.

మొత్తంగా మామా అల్లుళ్ల మధ్య రిలేష‌న్ మంచిగా లేవ‌ని.. లెక్క తేడా కొట్టిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. అనుకోకుండా వ‌చ్చిందో.. అనుకొనే వ‌చ్చిందో కానీ హ‌రీశ్ నోటి నుంచి వ‌చ్చిన మాట ఇప్పుడు అంద‌రి దృష్టిని భ‌లేగా ఆక‌ర్షిస్తోంది. మేన‌ల్లుడి తాజా మాట వింటే మేన‌మామ సైతం ఉలిక్కిప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. సిద్దిపేట రూర‌ల్ మండ‌లం ఇరుకోడ్ గ్రామంలో రెడ్డి సంక్షేమ భ‌వ‌నం.. ర‌జ‌క‌.. గౌడ సంఘ భ‌వ‌నాలు.. లైబ్ర‌రీ.. ఎస్సీ మాదిక క‌మ్యునిటీ హాల్ ను ప్రారంభించేశారు హ‌రీశ్. ప‌నిలో ప‌నిగా ఎస్పీ ఫంక్ష‌న్ హాల్ నిర్మాణానికి శంకుస్థాప‌న కూడా చేసేశారు.

ఇదంతా చ‌దువుతున్న‌ప్పుడు ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ళ్ల ముందు క‌ద‌లాడ‌టం ఖాయం. హైద‌రాబాద్ లో త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌తి కులానికి భ‌వ‌న నిర్మాణానికి స్థ‌లాన్ని.. డ‌బ్బుల్ని ప్ర‌క‌టించటం గుర్తుకొస్తుంది. మామ మాట‌ల్లో చెబితే.. మేన‌ల్లుడు చేత‌ల్లో చూపిస్తూ..త‌న నియోజ‌క‌వ‌ర్గంలో చేసి చూపించిన వైనం ముచ్చ‌ట ప‌డేలా చేస్తుంది.

ఇలా మ‌స్తు కార్య‌క్ర‌మాల్ని ఒక్క రోజులేనే నిర్వ‌హించిన వేళ‌.. హ‌రీశ్ నోటి నుంచి భ‌లే మాట వ‌చ్చింది. ఇంత‌కీ ఆయ‌నేమ‌న్నారంటే.. ఓట్లప్పుడు మాత్ర‌మే వ‌చ్చేటోడు నాయ‌కుడు కాదు.. ఐదేళ్లు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండి ప‌ని చేసేటోడే అస‌లైన నాయ‌కుడ‌నేశారు. ఏంది.. హ‌రీశేనా? ఇంత మాట అంద‌నుకోవ‌ద్దు. అస్సలు ఉలిక్కిప‌డొద్దు. ఎందుకంటే.. అక్ష‌రాల హ‌రీశ్ బాబు నోట్లో నుంచే ఈ మాట‌లు వ‌చ్చేశాయి. ఎక్క‌డో స్విచ్ వేస్తే మ‌రెక్క‌డో బల్బు వెలిగిన‌ట్లు.. హ‌రీశ్ మాట‌లు విన్నంత‌నే ఎక్క‌డో ఏదో క‌నెక్ట్ కాలేదు?  అందుకే అంది.. మేన‌ల్లుడి మాట వింటే మేన‌మామ సైతం ఉలిక్కిప‌డ‌తార‌ని. అర్థ‌మ‌య్యే ఉంటుంది క‌దా.. అందుకే.. మ‌రింత విప్పి చెప్ప‌ట్లేదు!
    
    
    

Tags:    

Similar News