రూ.6 ల‌క్ష‌ల బైక్ దొంగ దొరికాడు

Update: 2015-09-03 10:07 GMT
చ‌క్క‌గా టిప్ టాప్‌ గా రెఢీ అయ్యి వ‌చ్చాడు. స్టైలీష్‌ గా దుస్తులు వేసుకున్నాడు..స్లిమ్‌ గా ఉన్నాడు..పెద్ద రిచ్‌ మెన్‌ లా పోజు పెట్టాడు. ఇంకేముందు ఆ షోరూం వాళ్లంతా ప‌డిపోయారు. రూ.6 ల‌క్ష‌ల ఖ‌రీదైన బైక్‌ ను ట్ర‌య‌ల్ ర‌న్ వేస్తానని వారికి బురిడీ వేసి బైక్‌ తో స‌హా ఉడాయించాడు. చివ‌ర‌కు పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. వివరాల్లోకి వెళితే మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌ లో హార్లీ డేవిడ్‌సన్‌ బైకుల షోరూం నుంచి రూ.6 ల‌క్ష‌ల‌తో బైక్‌ తో ప‌రారైన స‌య్య‌ద్ తాహెర్‌ ను గురువారం ముంబై లో పోలీసులు  ప‌ట్టుకున్నారు.

 మంగ‌ళ‌వారం సాయంత్రం ఆ షోరూంకు వ‌చ్చిన తాహెర్ తాను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 23లో నివాసం ఉంటానని...సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగినని.. నెలకు రూ.1.5 లక్షల జీతం వస్తుందని వారికి చెప్పాడు. దీంతో అత‌డికి వారు స్ట్రీట్‌-750 మోడల్‌ వాహనాన్ని చూపించారు. ఆ బైక్‌ ఖరీదు రూ.6 లక్షలని చెప్పారు. త‌న వ‌ద్ద క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయ‌ని కొంత అమౌంట్ చెల్లించి..మిగిలింది ఫైనాన్స్ చేయాల‌ని వారిని రిక్వెస్ట్ చేశాడు. దీంతో అత‌డి మాట‌లు న‌మ్మిన షోరూం నిర్వాహ‌కులు ఓకే చెప్పారు.

 బైక్‌ ను ట్ర‌య‌ల్ ర‌న్ వేస్తాన‌ని చెప్పి బైక్ వేసుకెళ్లిన తాహెర్ త‌ర్వాత ఎంత సేప‌ట‌కీ రాక‌పోవ‌డంతో ..మోస‌పోయామ‌ని గ్ర‌హించిన షోరూం మేనేజ‌ర్ షీలా బంజ‌రాహిల్స్ పోలీస్‌ స్టేష‌న్‌ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ పుటేజీని ప‌రిశీలించారు. త‌ర్వాత రెండు చోట్ల అత‌డు పెట్రోల్ పోయించుకుని క‌రీంన‌గ‌ర్‌ వైపు వెళ్లిన‌ట్టు నిర్దారించుకున్నారు. చివ‌ర‌కు ఈ రోజు ఉద‌యం ముంబై లో అత‌డిని ప‌ట్టుకున్నారు. తాహెర్ ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంకు చెందిన వ్య‌క్తి గా నిర్దారించారు.
Tags:    

Similar News