హైకోర్టు తీవ్ర వ్యాఖ్య‌: మోడీ బీజేపీకి ప్ర‌ధాని కాదు

Update: 2017-08-27 05:03 GMT
కొన్నిసార్లు వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా కీల‌క స్థానాల్లో ఉన్న వారిపై న్యాయ‌స్థానాలు ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం మామూలే. అయితే.. ఒక ప్ర‌ధాన‌మంత్రిపై ఇంత భారీగా విరుచుకుప‌డింది లేద‌ని చెప్పాలి. తాజాగా ప్ర‌ధాని మోడీపై పంజాబ్‌.. హ‌ర్యానా హైకోర్టు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. మోడీ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఒక ప్ర‌ధానిపై హైకోర్టు ఇంత‌లా ఆగ్ర‌హం చెంద‌టం.. ఇంత తీవ్ర వ్యాఖ్య చేయ‌టం ఈ మ‌ధ్య కాలంలో ఇదే మొద‌టిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

కోట్లాది మంది భార‌తీయుల మ‌న‌సుల్ని దోచుకోవ‌ట‌మే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ ను తెచ్చుకున్న మోడీ లాంటి నేత‌పై హైకోర్టు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. వివాదాస్ప‌ద గురువు గుర్మీత్‌ను అదుపులోకి తీసుకునే వేళ‌లో చోటు చేసుకున్న విధ్వంసంపై హైకోర్టు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. పంచ‌కుల లాంటి ప్ర‌శాంత‌మైన ప‌ట్ట‌ణాన్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం త‌గ‌లెట్టేశారంటూ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన హైకోర్టు.. ఆందోళ‌నకారుల‌కు ప్ర‌భుత్వం దాసోహ‌మైన‌ట్లుగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యానించింది.

డేరాబాబాపై తీర్పు నేప‌థ్యంలో అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల‌ని దాఖ‌లైన పిటీష‌న్ పై హ‌ర్యానా.. పంజాబ్ చీఫ్ జ‌స్టిస్ ఎస్‌.. సింగ్ స‌రోన్‌.. జ‌స్టిస్ అవినాశ్ ఝింగాన్‌.. జ‌స్టిస్ సూర్య‌కాంత్ నేతృత్వంలోని ఫుల్ బెంచ్ ప్ర‌త్యేకంగా సమావేశ‌మై.. విచారించింది. ఈ సంద‌ర్భంగా హ‌ర్యానా ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఖ‌ట్ట‌ర్ స‌ర్కారు అస‌మ‌ర్థ‌త‌పై వ్యాఖ్య‌లు చేసిన హైకోర్టు.. ఒక చిన్న డీసీపీని బ‌లి తీసుకోవ‌టానికి ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. మ‌రి త‌ప్పుడు ఆదేశాలు ఇచ్చిన రాజ‌కీయ మాస్ట‌ర్ల సంగ‌తి ఏమిటంటూ ప్ర‌శ్నించింది.

తాజాగా చోటు చేసుకున్న విధ్వంసం ఓటు బ్యాంకును ఆక‌ర్షించ‌టానికి జ‌రిగిన రాజ‌కీయ లొంగుబాటుగా తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది. డేరా విధ్వంసంపై కేంద్రం త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ స‌త్య‌పాల్ జైన్ మాట్లాడుతూ.. హింసాత్మ‌క ఘ‌ట‌నలు అదుపు చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిద‌ని పేర్కొన్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన హైకోర్టు.. హ‌ర్యానా భార‌త‌దేశంలో భాగం కాదా? అని ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం. హ‌ర్యానా.. పంజాబ్ ల‌ను స‌వ‌తి పిల్ల‌లుగా చూస్తారా?  మోడీ కేవ‌లం బీజేపీకి మాత్ర‌మే కాదు.. ఆయ‌న దేశం మొత్తానికి ప్ర‌ధాన‌మంత్రి అంటూ ఫైర్ అయ్యింది. అంతేకాదు.. ఆస్తుల న‌ష్టంపై కోర్టు స్పందిస్తూ.. ఆ మొత్తాన్ని డేరా బాబా ఆస్తుల నుంచి జ‌ప్తు చేసుకొని రిక‌వ‌రీ చేయాలంటూ సంచ‌ల‌న ఆదేశాల్ని జారీ చేసింది. అంతేకాదు.. ఈ ఇష్యూ మీద రాజ‌కీయ‌.. మ‌త‌.. సామాజిక నాయ‌కులు ఎవ‌రు రెచ్చ‌గొట్టేలా మాట్లాడినా వారి మీద కేసులు న‌మోదు చేయాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాల్ని జారీ చేసింది. ప్ర‌ధానిపై ఈ స్థాయిలో ఒక రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్య‌లు చేయ‌టం సంచ‌ల‌నంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News