బాప్ రే: గౌతం అదానీ సంపద ఇంతలా పెరిగిందా?

Update: 2021-05-28 17:30 GMT
గుజరాత్ కు చెందిన వ్యాపారి గౌతం అదానీ సంపద కళ్లు బైర్లు కమ్మేలా పెరుగుతోంది. మోడీ సర్కార్ దేశంలో అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోని కుబేరులకు సైతం సాధ్యం కాని రీతిలో ఈయన సంపద పెరగడం చర్చనీయాంశమవుతోంది. ప్రతి 10వేల పెట్టుబడికి ఏడాదిలోనే రూ.52వేలకు చేరుకుంటుందంటే ఐదారురెట్లు సంపద ఈయన చేతిలో పడుతోందని తేటతెల్లమవుతోంది. ఏడాదిలో ఏకంగా 480శాతం పెరుగుదల కనిపిస్తోందంటే అదానీ సంపద ఎంత పోగు అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

గౌతం అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల దూకుడు పారిశ్రామికవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆయన సంపద గంటకు రూ.75వేల కోట్ల చొప్పున పెరుగుతూ వస్తోంది.

గత ఏడాది మే నుంచి ఏడాదికాలంలోనే గౌతం అదానీ సంపద భారత కుబేరుడు ముఖేష్ అంబానీ సరసన చేరాడు. అత్యంత సంపన్నుడైన కుటుంబాలైన టాటా, బిర్లా, వాడియా కుటుంబాలతో అదానీ పోటీపడుతున్నాడు.

అదానీ గ్రూపు కంపెనీలు రెండేళ్లుగా ఇన్ ఫ్రాపైనే ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నాయి. ఇందులో గ్యాస్ పంపిణీ, విద్యుత్, ఓడరేవులు వంటి రంగాలున్నాయి. వీటిల్లో పెట్టుబడుల విలువ కొన్ని రెట్లు పెరిగింది. అదానీ గ్యాస్ అత్యధికంగా 1069శాతం పెరగడం విశేషం. ఆ తర్వాతి స్థానాల్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ 842శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌(715%), అదానీ గ్రీన్‌ ఎనర్జీ(442%), అదానీ పవర్‌(176%), అదానీ పోర్ట్స్‌(144%) ఉన్నాయి. మొత్తం మీద ఆరు కంపెనీలు కలిపి 420% మేర పైపైకి ఎగబాకాయి.

 గత ఏడాది మే నెలలో అదానీ గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ.1,63,666 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం ఆ సంపద రూ.8,51,279 కోట్లకు చేరుకుంది. ఈ ఏడాది ఆరంభం నుంచి అదానీ సంపద పైకి ఎగబాకడంలో దూకుడు అందుకుంది.
Tags:    

Similar News