ప్ర‌చారంలో అడ‌గ‌కూడ‌ని ప్ర‌శ్న అడిగిన స్మృతి ఇరానీ

Update: 2019-05-10 05:14 GMT
గ‌తానికి.. వ‌ర్తామానానికి మ‌ధ్య వ్య‌త్యాసం చాలానే ఉంది. జ‌మానాలో నేత అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పే ముందు.. కాస్త ఆలోచించే వారు. త‌మ నోటి నుంచి వ‌చ్చే మాట వ‌ల్ల త‌మ‌కు ఏమైనా డ్యామేజ్ జ‌రుగుతుందా? అన్న సంకోచం ఉండేది. ఇప్పుడు అలాంటి మొహ‌మాటాల‌కుఅస్స‌లు తావివ్వ‌ని ప్ర‌జ‌లు.. ముఖం మీద‌నే చెప్పేస్తున్నారు.

వాతావ‌ర‌ణం త‌మ‌కుఅనుకూలంగా ఉందా?  లేదా? అన్న విష‌యాల్ని లెక్క చూసుకొని మాట్లాడాల్సిన బాధ్య‌త నేత‌ల మీద‌నే ఉంది. ఆ పాయింట్ మిస్ అయిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి దిమ్మ తిరిగే షాక్ ఒక‌టి తాజాగా త‌గిలింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని చేప‌ట్టిన స్మృతి ఇరానీ.. అక్క‌డ ఒక మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న స‌భ‌కు వ‌చ్చిన వారిని ఉద్దేశించిన స్మృతి.. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో రైతుల‌కు రుణ‌మాఫీ అందిందా? అన్న ప్ర‌శ్న‌ను సంధించారు. దీంతో స్పందించిన ప్ర‌జ‌లు.. రుణ‌మాఫీ మొత్తం అందిందంటూ ముక్త‌కంఠంతో చెప్ప‌టంతో ఆమె నోట మాట రాలేదు.

తాను సంధించిన ప్ర‌శ్న‌కు నెగిటివ్ స‌మాధానం వ‌చ్చినంత‌నే చెల‌రేగిపోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న స్మృతికి.. అందుకు భిన్నంగా ఓట‌ర్ల నుంచి వ‌చ్చిన స‌మాధానం ఆమె నోట మాట రాకుండా చేసింది. దీంతో.. ఆమెకు ఏం మాట్లాడాలో అర్థం కాని ప‌రిస్థితి. స్మృతికి ఎదురైన షాకింగ్ ఉదంతానికి సంబంధించిన వీడియోను తాజాగా అప్ లోడ్ చేశారు.

ఈ అంశంపై బీజేపీ నోట మాట రాని విధంగా మౌనం దాల్చితే.. కాంగ్రెస్ అందుకు భిన్నంగా చెల‌రేగిపోయింది. క‌మ‌ల‌నాథుల క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌కు ప్ర‌జ‌లే త‌గిన రీతిలో స‌మాధానాలు ఇస్తున్నారంటూ మండిప‌డింది. ఏమైనా.. బీజేపీ అగ్ర‌నేత‌లు పాల్గొనే స‌భ‌ల‌కు ముందు.. తాము ప్ర‌చారం చేసే స్థానాల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల గురించి కాసింత అవ‌గాహ‌న‌తో మాట్లాడితే మంచిది. అందుకు భిన్నంగా నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడితే.. స్మృతి మేడ‌మ్ కు ఎదురైన అనుభ‌వ‌మే ఎదుర‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.



Tags:    

Similar News