శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు బెయిల్ బుల్ వారెంట్ ని జారీ చేసింది. ఇంతకీ హై కోర్టు ఎందుకిలా కలెక్టర్ మీద సీరియస్ అయింది అంటే ఆయన ఒక కేసు విషయాన హై కోర్టు ఆదేశించినా పాటించలేదంటూ హై కోర్టు దాన్ని ధిక్కరణ చర్యగా భావించింది.
కలెక్టర్ కోర్టు ధిక్కరణ కేసులో విచారణకు హాజరుకాలేదని కూడా ఆగ్రహించింది. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తోటాడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 121లో 70 సెంట్ల స్థలాన్ని భూముల రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఇద్దరు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వినతిని పరిగణనలోకి తీసుకున్న హై కోర్టు ఎనిమిది వారాలలోగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని ఆదేశించింది.
అయితే కలెక్టర్ దాన్ని అమలు చేయలేదు, పైగా హై కోర్టు ఆదేశాల ప్రకారం కోర్టుకు కూడా హాజరు కాలేదు. దీంతో హై కోర్టు సీరియస్ అయింది. బెయిల్ బుల్ వారెంట్ ని జారీ చేసింది. ఇదిలా ఉండగా అధికార పనుల కారణంగానే కలెక్టర్ కోర్టుకు హాజరు కాలేదని అధికారులు అంటున్నారు.
మరి దీని మీద హై కోర్టు సీరియస్ అయిన నేపధ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లత్కర్ కోర్టుకు వెళ్ళి వివరణ ఇస్తారని చెబుతున్నారు. మొత్తానికి జిల్లా కలెక్టర్ కోర్టు ముందు హాజరు కావలసి వస్తోంది. జిల్లాలో ఇది సంచలనం గా మారింది.