‘కేసీఆర్’ తాజా నిర్ణయంపై హైకోర్టుకు అసంతృప్తి

Update: 2016-07-26 03:47 GMT
తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయటం.. ఆగ్రహం ప్రదర్శించటం.. నిర్ణయాల్ని తప్పు పట్టటం కొత్త విషయమేమీ కాదు. గడిచిన పాతిక నెలల్లో ఇలాంటివి చాలానే చోటు చేసుకున్నాయి. విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దుందుడుకుగా నిర్ణయాలు తీసుకునే కన్నా.. కాస్త ముందు వెనుకలు ఆలోచించి.. చట్టపరిధిలో నిర్ణయాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ.. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు తరచూ చర్చనీయాంశాలుగా మారుతుంటాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి అధికారపక్షాన్ని.. వారి నిర్ణయాల్ని.. వారి విధానాల్ని తీవ్రంగా తప్పు పట్టిన కేసీఆర్.. తన చేతుల్లోకి పవర్ వచ్చినా అలాంటి ధోరణినే ప్రదర్శించటం ఏమిటన్నది అర్థం కాదు. విశ్వవిద్యాలయాలకు వీసీల్నినిర్మించాల్సి ఉన్నా.. పాతిక నెలల నుంచి ఆయన గమ్మున ఉన్నారు. అంత సుదీర్ఘకాలం ఆయన ఎందుకుమౌనంగా ఉన్నారో.. ఎందుకు నియమకాలు జరపలేదన్న విషయానికి వివరణ ఇచ్చింది లేదు.

అలాంటి ఆయన ఉన్నట్లుండి ఈ రోజు పలు విశ్వవిద్యాలయాలకు వీసీల్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీసీల నియామకానికి సంబంధించి హైకోర్టు కేసు విచారిస్తున్న వేళనే.. ఇలాంటి నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన హైకోర్టు.. రెండేళ్లుగా వీసీల నియమకాన్ని నిలిపి ఉంచిన తెలంగాణ రాష్ట్రం.. మరో రెండు మూడు రోజులు ఆగలేకపోయిందే అంటూ ప్రశ్నించింది. తాజాగా ఆరు విశ్వవిద్యాలయాలకు కొత్తగా వీసీల్ని నియమించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేయటం విశేషం. వర్సిటీలకు వీసీల్ని నియమించినంత మాత్రాన తర్వాత ఏం చేయాలో తమకు తెలీదని అనుకోవద్దంటూ వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ పాతికనెలలుగా వీసీల్ని నియమించిన కేసీఆర్.. వీసీల వ్యవహారంపై హైకెర్టు తన నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధమవుతున్న వేళ.. కొత్త వీసీల పేర్లను ఎంపిక చేయటం ఏమిటి చెప్మా..?
Tags:    

Similar News