గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఫైర్ .. !

Update: 2021-05-17 11:33 GMT
గర్భిణికి చికిత్స అందించడానికి ఆస్పత్రులు నిరాకరించడంతో హైదరాబాద్‌ లోని మల్లాపూర్‌కి చెందిన పావని అనే గర్భిణిని కోఠిలోని ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా అంబులెన్సు‌లోనే మృతి చెందిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. తన బిడ్డ పావనిని , పావని కడుపులో ఉన్న పసికందును ప్రాణాలతో కాపాడుకునేందుకు పావని తల్లి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిండు గర్భిణి అయిన తన బిడ్డ తన కళ్ల ముందే కళ్లుమూసిన వైనాన్ని చూసి తట్టుకోలేక దుఖసాగరంలో మునిగిన ఆ తల్లిని కొన్ని గంటల వ్యవధిలోనే మరో కష్టం వెంటాడింది. గర్భిణి అయిన పావనిని ఖననం చేసేందుకు మల్లాపూర్ స్మశానవాటికకు తీసుకెళ్లగా, పసికందు చనిపోయినప్పటికీ ఇలా గర్భంలో ఉండగా అంత్యక్రియలు చేయలేం అంటూ స్మశానవాటికలో పనిచేసేవాళ్లు నిరాకరించారు.

ఆ కష్టంలోనూ ఆమె పావని మృతదేహంలోంచి శస్త్రచికిత్స ద్వారా పసికందు శవాన్ని వేరుచేయించేందుకు మరోసారి ధైర్యాన్నంతా కూడగట్టుకుని మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. ఈసారి శవానికి శస్త్రచికిత్స కుదరదని చెప్పడంతో ఆఖరికి ఏం చేయాలో అర్థంకాని నిస్సహాయ పరిస్థితుల్లో పావని మృతదేహం తీసుకుని ఆ తల్లి తిరిగి ఇంటికే చేరుకుంది. ఈ గర్భిణీ మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గర్భిణీ మృతి ఘటనపై విచారణ చేసి వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి జిల్లాలో కమ్యూనిటీ కిచన్‌ లు ఏర్పాటు చేసి లాక్‌ డౌన్‌ లో ఉచిత భోజనం కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ఎందుకు నిర్వహించడంలేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా.. ఇతర రాష్ట్రాల వలె తెలంగాణలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఎందుకు లేదని హైకోర్టు ప్రశ్నించింది. వ్యాక్సినేషన్‌లో తెలంగాణ 15వ స్థానంలో ఉందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. బెడ్స్‌ సామర్థ్యం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఒకలా, గ్రౌండ్‌ లెవల్‌లో మరో సంఖ్య ఉందని వివరించారు.
Tags:    

Similar News