రాజ‌ధాని ద‌ళిత రైతుల ప్లాట్ల‌పై హైకోర్టు కీల‌క ఆదేశం

Update: 2021-09-02 03:30 GMT
ఏపీ రాజ‌ధానిగా టీడీపీ స‌ర్కారు ఎంపిక చేసిన అమ‌రావ‌తి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతుల్లో ద‌ళిత రైతులు కూడా ఉన్నారు. వీరికి ప్ర‌భుత్వం కేటాయించిన ప్లాట్ల‌ను వెన‌క్కు తీసుకునే విష‌యంపై ఏపీ హైకోర్టు బుధ‌వారం నాడు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ద‌ళిత రైతుల‌కు ఇచ్చిన ప్లాట్ల‌ను వెన‌క్కు తీసుకునే ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను నిలుపుద‌ల చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు ద‌ళిత రైతుల‌కు భారీ ఊర‌ట‌గానే చెప్పాలి. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌ర్కారుకు ఒకింత మేర షాకేన‌ని కూడా చెప్ప‌క త‌ప్ప‌దు.

అమ‌రావతిని రాజ‌ధానిగా ఎంపిక చేసిన టీడీపీ ప్ర‌భుత్వం.. ఆ భూముల‌కు డ‌బ్బులేమీ చెల్లించ‌కుండా.. భూముల‌కు బ‌దులుగా రిట‌ర్న‌బుల్ ప్లాట్ల‌ను ఇవ్వ‌నున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ప్లాట్ల‌తో రాజ‌ధానిలో త‌మ‌కు కూడా మంచే జ‌రుగుతుంద‌న్న భావ‌న‌తో రైతులు పెద్ద ఎత్తున భూములు ఇచ్చారు. అయితే ఐదేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు స‌ర్కారు అమ‌రావ‌తిలో ఎలాంటి అభివృద్ధి ప‌నులు చేయ‌లేదు. కేవ‌లం అసెంబ్లీ, స‌చివాలయం, హైకోర్టు భ‌వ‌నాల‌ను మాత్ర‌మే నిర్మించింది. ఈ క్ర‌మంలో మొన్న‌టి ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్ స‌ర్కారు.. అమ‌రావతిలో ద‌ళితుల భూముల‌ను లాగేసుకున్న చంద్ర‌బాబు స‌ర్కారు.. ఇన్ సైడ‌ర్ ట్రేడింగ్ కు పాల్ప‌డింద‌ని, దానిపై విచార‌ణ‌కు కూడా ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను ముందుకు తీసుకొచ్చింది. వెర‌సి అమ‌రావతి భ‌విష్య‌త్తు ప్ర‌శ్నార్థ‌కంగా మారిపోయింద‌ని చెప్పాలి.

ఇలాంటి త‌రుణంలో రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుల‌కు చంద్ర‌బాబు స‌ర్కారు హామీ ఇచ్చిన రిట‌ర్న‌బుల్ ప్లాట్ల‌ను వెన‌క్కు తీసుకునే దిశ‌గా జ‌గ‌న్ స‌ర్కారు చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. ఇందుకోసం జీవో నెం:316ను జారీ చేసిన జ‌గ‌న్ స‌ర్కారు.. గ‌త నెల తొలి వారంలో 50 మంది ద‌ళిత రైతుల‌కు నోటీసులు జారీ చేసింది. ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చిన అసైన్డ్ భూముల‌కు కూడా ఎలా రిట‌ర్న‌బుల్ ప్లాట్లు ఇస్తార‌న్న‌ది జ‌గ‌న్ స‌ర్కారు వాద‌న‌. అయితే ప్ర‌భుత్వం ఇచ్చిన భూములే అయినా.. అవే త‌మ జీవ‌నాధారంగా మారాయ‌ని, అసైన్డ్ భూములు అయినా అవి త‌మ‌వేన‌ని, త‌మ భూములు రాజ‌ధానికి ఇచ్చిన నేప‌థ్యంలోనే త‌మ‌కు ప్లాట్ల‌ను కేటాయించార‌ని ద‌ళిత రైతులు కోర్టును ఆశ్ర‌యించారు. త‌మకు ఇచ్చిన ప్లాట్ల‌ను వెన‌క్కు తీసుకోకుండా ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేయాల‌ని వారు కోర్టును కోరారు. వారి అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన కోర్టు.. ప్లాట్ల‌ను వెన‌క్కు తీసుకునే స‌ర్కారు చ‌ర్య‌ల‌ను నిలుపుద‌ల చేస్తూ మ‌ధ్యంత‌ర ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News