స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్లు దోపిడీకి రాచమార్గాలే!

Update: 2016-09-08 05:54 GMT
అమరావతి నగర నిర్మాణ బాధ్యతలను సింగపూర్‌ కన్సార్టియం పేరుతో ఏర్పడిన సంస్థకు అప్పగించడానికి ఏపీ ప్రభుత్వం ముందే ఒక నిర్ణయానికి వచ్చేసిందని.. దీనికి అనుకూలంగా ఉండేలాగానే రకరకాల షరతులను విధించి మరీ.. పారదర్శకత లేని టెండరు నోటిఫికేషన్లను ఇచ్చిందని .. హైకోర్టులో ఇప్పుడు వాదనలు నడుస్తున్నాయి. స్విస్‌ ఛాలెంజ్‌ టెండర్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో తెలియజెబుతూ.. వాటిని ఆపుదల చేయాల్సిందిగా.. హైకోర్టులో పిటిషన్‌ నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈ టెండర్ల ప్రకటన ఇంత పారదర్శకత లేకుండా, ఇంత ఘోరంగా ఉన్నదంటూ కోర్టు అక్షింతలు వేసిన సంగతి ప్రజలకు తెలుసు.

ఆ తర్వాత మేలుకున్న చంద్రబాబు సర్కారు - టెండరు విధానంలో మార్పులు చేసి.. రెండంచెల పద్ధతిని తయారుచేసి ఆ విషయాన్ని కోర్టుకు నివేదించింది. టెండరుకు సవరణ ప్రకటనను కూడా తీసుకువచ్చింది. అయితే అందులోని షరతులు కూడా కుట్రపూరితమైనవేనని పిటిషన్‌ దారులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పెట్టిన పారదర్శకత లేని టెండరు ప్రక్రియను వెంటనే ఆపేయాలంటూ కోర్టును కోరుతున్నారు. ఈమేరకు బుధవారం నాడు వారు హైకోర్టులో తమ వాదనలు వినిపించారు.

చూడబోతే స్విస్‌ ఛాలెంజ్‌ పద్ధతిలో నిర్మాణానికి టెండర్లు అనే ప్రక్రియ హైకోర్టు గడప దాటి బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఓపెన్‌ టెండర్లే మంచిది కదా.. అని గతంలో హైకోర్టు కూడా అభ్యంతరాలు చెప్పిన నేపథ్యంలో చంద్రబాబు సర్కారుకు మొట్టికాయ తప్పకపోవచ్చునని.. స్విస్‌ టెండర్లకుట్ర విషయంలో వెనక్కు తగ్గాల్సి రావచ్చునని జనం అనుకుంటున్నారు.
Tags:    

Similar News