వివేకా హ‌త్యకేసుపై హైకోర్టు కీల‌క నిర్ణ‌యం!

Update: 2020-02-20 12:52 GMT
2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ‌త్యోదంతం ఇరు తెలుగు రాష్ట్రాల‌తోపాటు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దివంగ‌త నేత వైఎస్సార్ సోద‌రుడు, నాటి ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ బాబాయి అయిన వివేకా హ‌త్య ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంలో పెను దుమారం రేపింది. ఈ కేసుపై ఏపీ సీఎం జ‌గ‌న్ సిట్‌ ను నియ‌మించారు. ఓ వైపు సిట్ విచార‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలోనే ఈ కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. ఈ క్ర‌మంలోనే ఆ పిటిష‌న్‌పై విచారణ జ‌రిపిన హైకోర్టు....త‌దుప‌రి విచార‌ణ‌ను వాయిదా వేసింది. దర్యాప్తు సక్రమంగానే జరుగుతోంద‌ని, ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐకి అప్ప‌గించాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై నేడు విచార‌ణ జ‌రిగింది. ఈ పిటిష‌న్ల‌పై విచార‌ణ సంద‌ర్భంగా సిట్  ఇప్పటి వరకు చేసిన  విచారణ నివేదికను సీల్డ్ కవర్‌ లో అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ అందించారు.

వివేకా హ‌త్య కేసులో సిట్ విచారణ దాదాపుగా పూర్తికావ‌చ్చింద‌ని, త్వ‌ర‌లోనే విచార‌ణ పూర్తి నివేదిక హైకోర్టుకు అంద‌జేస్తామ‌ని ఏజీ తెలిపారు. కాబ‌ట్టి, ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని న్యాయమూర్తికి ఏజీ తెలియ‌జేశారు. అయితే, సిట్ విచారణపై తమకు నమ్మకం లేదని, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాల్సిందేనని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాసనం తదుపరి విచారణను ఫిబ్ర‌వ‌రి 24కు వాయిదా వేసింది.  ఈ కేసుకు సంబంధించిన జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారాని ఫిబ్ర‌వ‌రి 24న సమర్పించాలని ఏజీని న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో సీబీఐకి వివేకా హ‌త్య కేసు విచార‌ణ బ‌దిలీ అవుతుందా లేదా అన్న‌ది తేలాల్సి ఉంది.
 
   

Tags:    

Similar News