ఏపీ ఉన్నతాధికారులకు హైకోర్టు షాక్.. రోజంతా కోర్టులో నిలబడి ఉండండి

Update: 2021-07-07 04:30 GMT
కొన్ని నిర్లక్ష్యాలు.. అలక్ష్యాల విషయంలో న్యాయస్థానాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. పరుష వ్యాఖ్యల్ని సంధించటం చూస్తుంటాం. కోర్టుల్ని చికాకు పెట్టేలా వ్యవహరించే వ్యాఖ్యలకు.. అధికారుల పని తీరుతో కట్టలు తెగే ఆగ్రహం కలిగినా.. తమను తాము నిలువరించుకుంటూ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించటం కోర్టుల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఒక ఉదంతంలో ఏపీ హైకోర్టు ఇద్దరు ఉన్నతాధికారుల విషయంలో షాకింగ్ శిక్షను విధించింది. ఈ వ్యవహారం సర్వీసు అధికారులకు దిమ్మ తిరిగే షాకిచ్చిందని చెప్పక తప్పదు.

ఒక కేసు విషయంలో ఒక సీనియర్ అధికారికి.. ఒక ఐఎఫ్ఎస్ అధికారికి తొమ్మిది రోజుల జైలుశిక్షతో పాటు.. వెయ్యి రూపాయిల జరిమానాను విధించటం సంచలనంగా మారింది. దీంతో వారు కోర్టును క్షమించాలని కోరటంతోపాటు.. తమ వయసును.. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని తమ పట్ల కరుణను ప్రదర్శించాలని కోరారు. దీంతో తాము ఇచ్చిన తీర్పును సవరించిన కోర్టు.. వారికి కోర్టు ముగిసే వరకు నిలబడే ఉండాలన్న శిక్షను విధించింది. అదే సమయంలో వారికి విధించిన జరిమానాను చెల్లించటంలో విఫలమైతే మూడు రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇంతకీ.. ఏపీ హైకోర్టుకు అంత ఆగ్రహాం ఎందుకు వచ్చింది. అసలేం జరిగింది? అన్న విషయంలోకి వెళితే.. విలేజ్ హార్టీ కల్చర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఉద్యాన వన శాఖ 2020 జనవరి 10న నోటిఫికేషన్ జారీ చేసింది. అదే నెలలో సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో తాము నిర్దేశించిన పలు అర్హతల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని సవాలు చేస్తూ.. ఎస్. క్రిష్ణతో పాటు మరో 35 మంది అభ్యర్థులు హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరిపిన హైకోర్టు.. సవరణ నోటిఫికేషన్ రద్దు చేసింది. అంతేకాదు.. పోస్టుల భర్తీలో పిటిషనర్లకు అవకాశం కల్పించాలని మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చింది.

అయితే.. వాటిని ఎత్తి వేయాలని ప్రభుత్వం అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అయితే.. హైకోర్టు ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది. ఇదే సమయంలో హైకోర్టు ఆదేశాల్ని అధికారులు అమలు చేయలేదంటూ.. అభ్యర్థులు కోర్టు దిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు.. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాల్ని అమలు చేయలేదని తేల్చి.. సంచలన ఆదేశాల్ని జారీ చేశారు. వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఇస్తే.. కోర్టు ఆదేశాల్ని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని తప్పు పట్టింది. ఇలాంటి వారి విషయంలో కనికరం చూపిస్తే.. తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందని పేర్కొన్న న్యాయస్థానం ఇద్దరు సీనియర్ అధికారులకు విధించిన శిక్ష ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News