ఐదుగురు జడ్జిల మీద తాజా వేటు

Update: 2016-06-28 10:19 GMT
దేశ చరిత్రలో తొలిసారి జరిగినట్లుగా చెబుతున్న తెలంగాణ జడ్జిల నిరసన ప్రదర్శనపై ఉమ్మడి హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సోమవారం తెలంగాణ జడ్జిల సంఘం అధ్యక్షుడు.. కార్యదర్శులపై క్రమశిక్షణారాహిత్య చర్యల కింద వేటు వేసిన హైకోర్టు.. తాజాగా మరో ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైకోర్టు విభజన.. జడ్జిల ప్రాధమిక కేటాయింపుల అంశం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తెలంగాణ జడ్జిలు ఆదివారం వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టటం.. గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ కు 120 మంది జడ్జిలు నిరసన ప్రదర్శనగా వెళ్లటం.. దీన్ని పోలీసులు అడ్డుకోవటం లాంటి ఘటనలు జరిగాయి. మరో ఆసక్తికర సన్నివేశం ఏమిటంటే..నిత్యం న్యాయం చెప్పే జడ్జిలే.. తమకు న్యాయం కావాలంటూ రోడ్ల మీదకు రావటంపై పెద్ద ఎత్తున విస్మయం వ్యక్తమైంది. జడ్జిల చర్య క్రమశిక్షణారాహిత్యం కిందకు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దీనికి తగ్గట్లే.. సోమవారం ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేసిన హైకోర్టు.. మంగళవారం ఐదుగురు జడ్జిలపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. సోమవారం వేటు వేసిన జడ్జిలకు మద్దుతుగా పలు చోట్ల న్యాయవాదులు.. కోర్టు సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనే.. హైకోర్టు మరో ఐదుగురి మీద క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా తీసుకోవటం గమనార్హం.
Tags:    

Similar News