ఇది కేంద్రం మాట : అమరావతిలోనే హైకోర్టు

Update: 2022-08-04 11:30 GMT
ఏపీ హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని స్పష్టమైన ప్రకటన కేంద్రం చేసింది. దీని మీద ఎటువంటి శషబిషలకు తావు లేకుండా కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ హైకోర్టు త్వరలో కర్నూల్ కి మారుతుంది అని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో రాజ్యసభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజుని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఒక ప్రశ్నను సంధించారు. కర్నూల్ కి హైకోర్టు మారుతుందా. దానికి సంబంధించి ప్రతిపాదన ఏదైనా మీ వద్ద పెండింగులో ఉందా అని ఆయన అడిగారు.

దానికి బదులిస్తూ కేంద్ర మంత్రి అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్దకు ఇప్పటిదాకా రాలేదని చెప్పి కుండబద్ధలు కొట్టారు. ఇక అమరావతిలో హై కోర్టు ఏర్పాటు విభజన చట్టం ప్రకారం జరిగిందని గుర్తు చేశారు. ఇపుడు హైకోర్టుని మార్చాలీ అంటే అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు కలసి తీసుకోవాల్సిన నిర్ణయం అని చెప్పుకొచ్చారు.

రాష్ట్రప్రభుత్వమే హైకోర్టు నిర్వహణ బాధ్యతలు చూస్తుంది కాబట్టి హై కోర్టు ప్రభుత్వం నుంచి ఏవైనా ప్రతిపాదనలు కేంద్రానికి వస్తే తాము చూస్తామని అన్నారు. అయితే 2020 ఫిబ్రవరిలో కర్నూలుకు మార్చాలని సీఎం జగన్ ప్రతిపాదించారని కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఇక హై కోర్టు మార్పునకు కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పారు.

అదెలానంటే హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్‌  సంబంధిత హైకోర్టుతో దీని మీద సంప్రదిస్తుందని చెప్పారు. ఆ మీదట  రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్ణయిస్తుందని కేంద్ర మంత్రి రిజుజు పేర్కొన్నారు. ఒక హైకోర్టును ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి బదిలీ చేయాలంట  రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి స్పష్టం చేయడం విశేషం.

ఇలా రెండు వైపుల నుంచి అభిప్రాయాలను కేంద్రానికి చేరాలని కూడా ఆయన అన్నారు. మొత్తానికి చూస్తే రెండున్నర ఏళ్ళ క్రితం జగన్ చేసిన ప్రతిపాదన తప్ప లేటెస్ట్ గా తమ వద్ద ఏ రకమైన ప్రతిపాదన లేదని ఆయన చెప్పేశారు.

హైకోర్టు మార్చడం పెద్ద తతంగం అని కూడా కేంద్ర మంత్రి మాటలలో వ్యక్తం అయింది. పైగా అది తమ చేతులల్లో ప్రస్తుతానికి లేదని చెప్పడం ద్వారా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు నీళ్ళు చల్లేశారు. ఇక అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని చెప్పడం ద్వారా భారీ ఊరటను అక్కడివారికి ఇచ్చారు. ఒక విధంగా చూస్తే జగన్ సర్కార్ కి ఇది ఒక షాకింగ్ పరిణామమే అంటున్నారు.
Tags:    

Similar News