చదువుకున్న మహిళలందరూ ఉద్యోగం చేయాలని లేదు: హైకోర్టు సంచలనం

Update: 2022-06-11 10:37 GMT
ఈ కాలంలో కుటుంబంలో ఒక్కరు పనిచేస్తే పూటగడవడం కష్టమే. అందుకే భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడుతున్నారు. పట్టణాలు, నగరాలకు వలస వెళ్లి మరీ పిల్లల భవిష్యత్ కోసం వివిధ పనులు చేస్తున్నారు. చదువుకున్న ప్రతీ మహిళ ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని పలు కుటుంబాల్లో ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ముంబై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..

చదువుకున్న ప్రతీ మహిళా ఖచ్చితంగా ఉద్యోగం చేయాలన్న నిబంధన ఏదీ లేదని ముంబై హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కేవలం ఒక మహిళా ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు కలిగి ఉందన్న కారణంగా ఆమె ఖచ్చితంగా ఉద్యోగం చేయాలని.. ఇంట్లో ఉండకూడదని అర్థం కాదని జస్టిస్ భారతి డాంగ్రే అన్నారు.

ఉద్యోగం చేయడం అనేది మహిళా ఎంపిక మాత్రమేనని.. గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన ఆమె ఇంటి వద్ద కూర్చోవడానికి వీలులేదనే వాదన సరైంది కాదని ఆమె అన్నారు.  స్థిరమైన ఆదాయాన్ని పొందుతోన్న ఓ భార్య తన భర్త నుంచి భరణం కోరిందన్న కేసు విచారణలో భాగంగా జస్టిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.

2010లో ఓ జంట వివాహం చేసుకుంది. 2013 నుంచి వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. కూతురు తల్లితో ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలని సదురు మహిళ కోర్టును ఆశ్రయించింది. కుటుంబ న్యాయస్థానంలో తనతోపాటు తన కూతురు జీవనానికి సరిపడా డబ్బు భర్త నుంచి అందించాలని పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు భార్యకు నెలకు రూ.5000 , చిన్నారి పోషణ కోసం రూ.7000 చెల్లించాలని తీర్పునిచ్చింది. అయితే దీనిపై సదురు భర్త.. తన భార్య ఉద్యోగం చేస్తోందని.. తనకు ఆదాయ మార్గం లేదని తప్పుడు సమాచారంతో పిటీషన్ దాఖలు చేసిందని సవాలుగా మరో పిటీషన్ దాఖలు చేశాడు.

ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు వచ్చిన ఈ కేసు విషయంలో జస్టిస్ భారతి డాంగ్రే పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేశారు. పనిచేయాలా వద్దా? అన్నది మహిళా హక్కు అని.. ఆమె గ్రాడ్యుయేట్ అయినంత మాత్రాన పనిచేయకూడదనే నిబంధన ఏముంది అంటూ ప్రశ్నించారు.

ఇక తనను తాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈరోజు నేను జడ్జిని, రేపునేను ఇంట్లో కూర్చుంటాననుకోండి.. నీకు న్యాయమూర్తి అయ్యే అర్హత ఉంది. ఇంట్లో కూర్చోకూడదని చెబుతారా? అని జస్టిస్ భారతి ప్రశ్నించారు. మొత్తంగా ఈ కేసు ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Tags:    

Similar News