దేశంలో దాద్రినే కాదు.. 'దిలీప్ కాలే'లు ఉన్నారు

Update: 2015-10-15 09:56 GMT
మనిషి అన్న వాడు దాద్రి ఘటనను సమర్థించలేరు. సాటి మనిషిని అత్యంత దారుణంగా ఒక సమూహం చంపేయటం దుర్మార్గం. అయితే.. అలాంటి పరిస్థితుల మీద సామాజిక వేత్తలు.. మీడియా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా ఉన్న సామరస్యం అక్కడక్కడా చెదిరిపోతున్న దానికి కారణాలేమిటన్నది వెతకాలి. అదేసమయంలో దాద్రి లాంటి అంశాలతో పాటు.. తాజాగా వెలుగులోకి వస్తున్న దిలీప్ కాలే లాంటి మంచి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.

దురదృష్టవశాత్తు చెడు గురించి చెలరేగిపోయి మాట్లాడే వారు.. మంచి గురించి మాత్రం మౌనంగా ఉంటున్నారు. ప్రతికూల అంశాలతో పాటు.. సానుకూల అంశాల కారణంగా సమాజంలో అన్నీ ఉన్నాయన్న సందేశంతో పాటు.. నలుగురు మెచ్చే దారి ఏమిటన్న విషయాన్ని అసహనంతో ఉన్న సమూహం కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. దాద్రి ఘటనకు దారి తీసిన అంశాల మీద ఫోకస్ చేయని చాలామంది.. దాన్నో దుర్మార్గమైన ఘటనగా చిత్రీకరిస్తూ తిట్టిపోయటంతోనే సరిపెడుతుంటారు. ఏదైనా ఘటన జరగటానికి సామాజిక అంశాలు చాలానే దోహదం చేస్తాయి. వాటిని జాగరూకతతో పరిశీలించటం ద్వారా.. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించి.. వాటిని సరిదిద్దటం అత్యవసరం. కానీ.. అలాంటి ప్రయత్నం ఏమీ జరగటం లేదన్న విషయం దాద్రి ఘటన చెప్పకనే చెబుతుంది.

ఇక.. దాద్రి అంశాన్ని చూపించి.. భారత్ మొత్తం అలాంటి పరిస్థితి ఉందన్న విచిత్రమైన వాదన.. వేదన వ్యక్తం చేసే వారు చాలామందే ఈ మధ్య కనిపిస్తున్నారు. అయితే.. నాణెంలో బొరుసు మాదిరే బొమ్మ కూడా ఉంటుందని.. దాద్రి లాంటి అసహజ పరిణామాలతో పాటు.. దిలీప్ కాలే లాంటి వారు చేస్తున్న మంచి పనులు ఉన్నాయన్న విషయాన్ని నలుగురికి చాటాల్సిన అవసరం ఉంది.

ఇంతకీ ఈ దిలీప్ కాలే ఎవరు? ఆయనేం చేశారన్న విషయంలోకి వెళితే.. ముంబయి మహా నగరంలోని ధారావికి చెందిన 53 ఏళ్ల హిందూ వ్యాపారి. అతగాడికి ఒక షాపు ఉంది. దానికి కాస్త దగ్గర్లోనే ఒక మసీదు ఉంది. మసీదు పాతది కావటంతో.. దానికి రిపేరు చేస్తున్నారు. దీంతో.. అక్కడకు నిత్యం ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చే వారి కోసం.. తాత్కలికంగా దిలీప్ కాలే స్థలాన్ని అడిగారు.

వాస్తవానికి ఆ స్థలం ఉన్నషాపును కానీ వాణిజ్య పరంగా అద్దెకు ఇస్తే నెలకు రూ.లక్ష  వచ్చే వీలుంది. కానీ.. ఆయన మాత్రం తనకు పైసా అక్కర్లేదని.. మసీదు నిర్మాణం పూర్తయ్యే వరకూ ఉచితంగా ప్రార్థనలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే.. అతనికి అద్దె ఇవ్వాలని ముస్లింలు ప్రయత్నించినా ఆయన సున్నితంగా తిరస్కరించారు.

అంతేకాదు.. ప్రార్థనలు చేసుకోవటానికి వీలుగా షాపులోని పాత బండల్ని తీసేసి చక్కటి మార్బుల్ బండలు వేయించటంతో పాటు.. నల్లా వసతి కల్పించాడు. ఈ షాపు విస్తీర్ణం 2500 చదరపు అడుగులు ఉంటుందని చెబుతున్నారు. ముస్లింల ప్రార్థనలకు అవకాశం ఇచ్చి.. అద్దె తీసుకోని కారణంగా మసీదుకు రూ.8లక్షల రూపాయిల ఆదాయం మిగిలింది. మరికొద్ది రోజుల్లో ఈ మసీదు నిర్మాణం పూర్తి కానుందని చెబుతున్నారు. మతసామరస్యానికి నిదర్శనంగా నిలవటమే కాదు.. రెండు వర్గాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని నిలిపే ఇలాంటి ఘటనలు మాత్రం దాద్రి మాదిరి ప్రముఖంగా రాకపోవటమే అసలు విషాదం. చెడును ఖండిద్దాం.. మంచిని పది మందికి వ్యాపింప చేయాలన్న సిద్ధాంతాన్ని అందరూ బాధ్యతగా స్వీకరిస్తే ఎంత బాగుండు..?
Tags:    

Similar News