కరోనా తగ్గాక ఇమ్యూనిటీ ఎన్ని నెలలు ఉంటుందంటే ?

Update: 2021-05-31 11:30 GMT
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ జోరు దేశంలో కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడుతూవస్తోంది. గతంలో రోజుకి నాలుగు లక్షలకి పైగా కరోనా మహమ్మారి కేసులు నమోదు కాగా , ప్రస్తుతం ఆ సంఖ్య లక్షన్నర కి పడిపోయింది. అలాగే మరణాల సంఖ్య కూడా తగ్గుతూవస్తోంది. అయితే , ఈ తరుణంలో ఓ అంశం పై చర్చ ఎక్కువగా జరుగుతోంది. కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యి , తగ్గిపోయిన తర్వాత ఇమ్యూనిటీ ఏర్పడుతుంది. ఈ ఇమ్యూనిటీ రెండు నుండి మూడు నెలల వరకు ఉండొచ్చని కొందరు, కాదు ఆరు నెలల వరకూ ఉంటుందని మరికొందరు చెప్తున్నారు. ఈ తరుణంల తాజా పరిశోధనలు శుభవార్త చెప్తున్నాయి. కరోనా సోకి తగ్గినవారిలో ఏడాది వరకు ఇమ్యూనిటీ ఉంటుందని, వ్యాక్సిన్‌ వేసుకుంటే ఇంకొంత ప్రయోజనమని స్పష్టం చేస్తున్నాయి.  

వివరాల్లోకి వెళ్తే .. కరోనా సోకి  , ఆ మహమ్మారి భారి నుండి బయటపడిన వారిపై ఇటీవల రాక్‌ ఫెల్లర్‌ యూనివర్సిటీ, మరికొందరు శాస్త్రవేత్తలు వేర్వేరుగా పలు పరిశోధనలు నిర్వహించారు. కరోనా ఇన్ఫెక్షన్‌ మనుషుల్లోని బోన్‌ మ్యారో  ప్లాస్మాను ప్రేరేపిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో కరోనా సోకి తగ్గినవారిలో ఇమ్యూనిటీ ఏడాదికిపైగా ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్‌  తీసుకుంటే మరిన్ని ఎక్కువ రోజులు ఇమ్మ్యూనిటీ ఏర్పడే అవకాశం అయితే ఉంది. ఒక పరిశోధన ప్రకారం.. శరీరంలో కరోనా అంతమైపోయాక కూడా బోన్‌ మ్యారోలోని కణాలు కరోనాకు సంబంధించిన అంశాలను గుర్తుపెట్టుకుంటాయి. మళ్లీ అవసరమైనప్పుడు వెంటనే కరోనా యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి, రక్తంలోకి వదులుతాయి. ఇన్ఫెక్షన్‌ సోకినప్పటి నుంచి కనీసం 12 నెలల వరకు ఇది కొనసాగుతుందని.. ఆలోగా వైరస్‌ మళ్లీ సోకితే వెంటనే గుర్తించి, అడ్డుకునేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తాయని తేల్చారు.

కరోనా సోకిన 77 మందిపై పరిశోధనలు చేశారు. వారి రోగ నిరోధక వ్యవస్థలో వచ్చిన మార్పులు, కరోనా యాంటీబాడీలు, మెమరీ బీ కణాలను, 3 నెలలకోసారి చొప్పున 5 సార్లు పరిశీలించారు.  ఈ 77 మందిలో కరోనా వచ్చాక నాలుగు నెలలు యాంటీబాడీలు బాగానే ఉన్నాయని, తర్వాత వేగంగా తగ్గాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆపైనా తగ్గిపోతూ వచ్చాయని తేల్చారు. బోన్‌ మ్యారోలోని మెమరీ బీ కణాలు మాత్రం యథాతథంగా ఉన్నట్టు గుర్తించారు. కరోనా వచ్చి తగ్గిన 19 మంది బోన్‌మ్యారో నుంచి కణజాలాన్ని పరిశీలించారు. వారికి కరోనా ఇన్ఫెక్షన్‌ సోకిననాటి నుంచి ఏడు నెలల తర్వాత కూడా.. 15 మంది బోన్‌మ్యారోలో మెమరీ బీ కణాలను గుర్తించారు. మిగతా నలుగురిలో ఆ కణాలు లేవు. ∙కరోనా సోకి తగ్గిన సుమారు 75 శాతం మందిలో మెమరీ బీ కణాలు ఎక్కువకాలం ఉంటాయని అన్నారు.

మెమరీ బీ కణాలు, యాంటీబాడీలు కొత్త వేరియంట్లను ఎదుర్కొంటాయా అన్న దానిపై శాస్త్రవేత్తలు విడిగా పరిశోధన చేశారు. కరోనా తగ్గిన తర్వాత 6–12 నెలల మధ్య యాంటీబాడీల్లో ఏ మార్పు జరగలేదని గుర్తించారు. ఇదే సమయంలో మెమరీ బీ కణాల్లో మాత్రం ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ వచ్చాయని, పరిస్థితికి అనుగుణంగా అప్‌ డేట్‌ అవుతున్నాయని తేల్చారు.  మెమరీ బీ కణాలు అప్‌ డేట్‌ అయ్యాక అవి ఉత్పత్తి చేసిన యాంటీబాడీలు సమర్థవంతంగా ఉంటున్నాయని, చాలా రకాల కరోనా వేరియంట్లను ఎదుర్కోగలుగుతున్నాయని గుర్తించారు. అసలు వ్యాక్సిన్‌ వేసుకోని వారిలో, ఇన్ఫెక్షన్‌ సోకిన ఏడాది తర్వాత కూడా స్వల్పంగా ఇమ్యూనిటీ ఉంటోంది. కొత్త వేరియంట్లు సోకితే ఎదుర్కొనే సామర్థ్యం మరికాస్త తక్కువగా కనిపిస్తోంది. కరోనా సోకి తగ్గిపోయిన తర్వాత వ్యాక్సిన్‌ వేసుకున్న వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటోంది. వారికి కొత్త వేరియంట్లు సోకినా కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగే శక్తి సమకూరుతోంది. వీరికి బూస్టర్‌ డోసుల అవసరం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Tags:    

Similar News