ఆనందయ్య ఎన్ని రకాల మందులు ఇచ్చేవారు? అవి దేనికి వాడారు?

Update: 2021-05-22 11:30 GMT
ఆన్ లైన్.. ఆఫ్ లైన్ ఇప్పుడంతా కృష్ణపట్నం ఆనందయ్యకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అంతేకాదు.. బోలెడంత చర్చ నడుస్తోంది. ఈ మందును బలంగా విశ్వసించి.. దానికి దన్నుగా నిలిచే వారు ఉంటే.. మరికొందరు ఈ రోజుల్లోనూ నాటు మందులేందంటూ విరుచుకుపడుతున్నారు. వేలం వెర్రిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇలాంటి వారికి ఆనందయ్యకు దన్నుగా నిలిచే వారు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. ఇంత శాస్త్రీయత.. అంత సైంటిఫిక్ అని చెప్పేటోళ్లు.. ఈ రోజుకు ప్లాస్మా వైద్యం మీద ఒక క్లారిటీ ఏడ్చి చావలేదు.. ఒకసారి ఓకే చెబుతారు.. మరోసారి నో చెబుతారు? మీలాంటోళ్లా.. ఆనందయ్య లాంటోళ్లను విమర్శించేదని ఫైర్ అవుతున్నారు.

మొత్తంగా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఆనందయ్య మందు మీద జోరుగా చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఇంతకీ ఆనందయ్య ఇచ్చే మందేమిటి? ఆయన ఎన్ని రకాల మందులు ఇస్తారు? మందులు ఇచ్చే సమయంలో ఏం చెబుతారు? అన్నది ప్రశ్నలుగా మారాయి. ఇక్కడ మీకో విషయాన్ని మేం స్పష్టం చేయదలుచుకున్నాం. ఈ వార్త వరకు ఆనందయ్య మందును మేం వ్యతిరేకించటం లేదు. అదే సమయంలో సమర్థించటం లేదు. జరిగిన విషయాలు.. జరుగుతున్న విషయాల్ని మాత్రమే చెబుతున్నాం.

ప్రజల్లోని ఆసక్తి కలిగించే అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వటం తప్పు కాదు. కానీ.. దాని మీద తీర్పు ఇవ్వటం కొంతమంది చేస్తుంటారు. మేం ఇప్పుడు ఆ పని చేయటం లేదు. ఇప్పటికే ఐసీఎంఆర్ నిపుణులు పలువురు రంగంలోకి దిగి.. ఆనందయ్య మందు మీద నివేదికను సిద్ధం చేస్తున్నారు. అందుకే.. ఆ లోతుల్లోకి వెళ్లదలుచుకోలేదు. ఈ కథనంలో మాత్రం.. ఆనందయ్య ఇచ్చే ఐదు రకాల మందుల గురించి.. వారేం చెబుతారన్న విషయాన్ని చెబుతున్నాం. సమాచారం అందించటమే ఉద్దేశం తప్పించి మరింకేమీ లేదన్న విషయాన్ని గుర్తించాలి. ఈ సమాచారన్ని సేకరించి ఇవ్వటంలో ఉద్దేశం.. అసలేం జరుగుతుందన్న అవగాహన కోసమే ఈ వివరాల్ని ఇస్తున్నామన్నది మర్చిపోకూడదు.

కరోనా వచ్చిన వారికి.. రాని వారికి ఆనందయ్య మందులు పంపిణీ చేస్తారు. అన్ని ఉచితంగానే చేస్తారు. మొత్తం ఐదు రకాల మందుల్ని పంపిణీ చేస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఒకటి.. పాజిటివ్ వచ్చిన వారికి నాలుగు మందుల్ని ఇస్తున్నారు. కరోనా రకం రాకుండా ''పి'' రకం మందు.. కోవిడ్ వచ్చిన వారికి ''పి''.. ''ఎఫ్''.. ''ఎల్''.. ''కే'' రకాల మందుల్ని ఇస్తున్నారు.  ఆక్సిజన్ లెవల్స్ పడిపోయిన వారికి మాత్రం నాలుగు రకాలతో పాటు.. పసరు డ్రాప్స్ (కళ్లల్లో వేయాలి) ఇస్తున్నారు.

'పీ' మందు
ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుందని చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు, పాజిటివ్‌ లేని వారు రోగనిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఒక్క రోజు రెండు సార్లు వాడాలి.
ఈ మందులో.. ''తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌ దంగిలే ఐదు బకెట్లు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, ఫిరంగి చెక్క పొడి అన్ని కలిపి ఒక బకెట్‌లో సిద్ధం చేసి మిక్సీ వేసిన తర్వాత అవసరమైనంత తేనె కలిపి నాలుగు గంటల పాటు ఉడికించి మిశ్రమంగా తయారు చేసి ఇస్తున్నారు''

'ఎఫ్‌' మందు
పాజిటివ్‌ గా తేలిన వారికి మాత్రమే ఈ మందు ఇస్తున్నారు. ఇందులో పుప్పింటి ఆకు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్లు, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల వరకు సిద్ధం చేసి ఆన్నింటిని కలిపి మిక్సీ వేసి చూర్ణంగా ఇస్తున్నారు. ఇది రోజు భోజనం తర్వాత రెండు సార్లు చొప్పున మూడు రోజులు తీసుకోవాలి.

'ఎల్' మందు
పాజిటివ్‌ ఉన్న వారికే దీన్ని ఇస్తారు. ఇందులో నేల ఉసిరి, గుంట గలగర ఆకులు ఒక బకెట్, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనె రెండు మూడు కేజీలు తీసుకొని సిద్ధం చేస్తున్నారు. దీనిని ఫీ,ఎఫ్‌ రకాల మందుతో పాటు రోజుకు ఒక్కసారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

'కే' మందు
దీన్ని కూడా పాజిటివ్‌ ఉన్నోళ్లకే. ఇందులో పెద్ద పల్లేరు కాయలు ఒక బకెట్, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పళ్ల చెక్క, జాజికాయ, తేనెలను రెండు నుంచి మూడు కేజీల తీసుకుని కలిపి దీన్ని సిద్ధం చేస్తున్నారు. ఇది పాజిటివ్‌ రోగులకు రోజుకు ఒక్క సారి చొప్పున రెండు రోజులు తీసుకోవాలి.

'ఐ' మందు
ఆక్సిజన్‌ తగ్గిన వారికి కంటి డ్రాప్స్‌. తేనె, ముళ్ల వంకాయ గుజ్జు, తోక మిరియాలను వినియోగిస్తారు. ఇందులో కిలో తేనె, వంద గ్రాముల తోక మిరియాలు, కొద్దిగా వంకాయ గుజ్జుతో సిద్ధం చేసి పల్స్‌ తీవ్రను బట్టి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క డ్రాప్‌ వేయాలి.
Tags:    

Similar News