మొదలైన ఆకలి చావులు..కడుపు మంటతో అల్లర్లు

Update: 2020-04-12 12:08 GMT
కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే లాక్‌ డౌన్‌ ఒక్కటే మార్గం అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మూడు వారాల పాటు లాక్‌ డౌన్‌ ను విధించిన విషయం తెల్సిందే. లాక్‌ డౌన్‌ తో కరోనా అదుపులోనే ఉంది. లాక్‌ డౌన్‌ విధించకుంటే లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు నమోదు అయ్యేవి అంటూ ప్రభుత్వ వర్గాల వారు అంటున్నారు. అయితే లాక్‌ డౌన్‌ విధించిన తర్వాత తీసుకున్న జాగ్రత్తలు.. పేదలు వలస కూలీల పట్ట వ్యవహరించిన తీరు విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. రోజు వారి కూలీలు లాక్‌ డౌన్‌ కారణంగా కనీసం తినడానికి తిండి లేక ఆకలి చావులు చూడాల్సి వస్తుందని మొదటి నుండి విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

దేశ వ్యాప్తంగా కూడా లాక్‌ డౌన్‌ సమయంలో ఎవరికి ఆహారం కొరత రాకుండా చూస్తున్నాం అంటూ కేంద్రం మొదటి నుండే ప్రకటనలు చేస్తూ వచ్చింది. అయినా కూడా దేశంలో ఆకలి చావులు మొదలయ్యాయి. ఉత్తర భారత దేశంలో అధికారికంగా మూడు ఆకలి చావులు నమోదు కాగా అనధికారికంగా పదుల సంఖ్యలో ఆకలి చావులు ఉంటాయంటూ జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నాయి. ఆకలి చావులను ఆపేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలు పెడుతున్న ఖర్చు సరిపోవడం లేదనేది కొందరి అభిప్రాయం.

ఇక ఆకలి చావులతో భయపడి.. కడుపు మంటతో ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. వలస కూలీల కోసం ప్రభుత్వాలు నిర్వహిస్తున్న సెల్టర్లలో మొదటి నుండి అనుకుంటున్నట్లుగానే అల్లర్లు జరుగుతున్నాయి. సూరత్‌ లో టెక్స్‌ టైల్స్‌ రంగంలో పని చేసే వలస కూలీలను ఎటు వెళ్లనివ్వడం లేదు. కనీసం బయటకు కూడా వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో వలస కూలీలు గురువారం రాత్రి రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. తమను తమ సొంత ప్రాంతాలకు వెళ్లనివ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ప్రైవేట్‌ ఆస్తులను నాశనం చేయడంతో పాటు వాహనాలను తగులబెడుతూ హింసాత్మక సంఘటనలకు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో వలస కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేయడంతో పరిస్థితి మరింతగా సీరియస్‌ అయ్యింది.

ఇలాంటి సంఘటనలు మరింతగా ఉదృతం అయ్యే అవకాశం ఉందని రాబోయే రోజుల్లో లాక్‌ డౌన్‌ కొనసాగితే ఆకలి చావులు వందల్లో ఉంటాయని అల్లర్లకు వందల కోట్ల ఆస్తుల నష్టం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ కొనసాగించే విషయంలో కాస్త వెనుకంజ వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.


Tags:    

Similar News