ఇండిగో విమానంలో అదరగొట్టేసిన హైదరాబాద్ కార్పొరేటర్

Update: 2021-05-29 11:30 GMT
ప్రముఖులు.. సెలబ్రిటీలు.. రాజకీయ నేతలు.. ఇలా పలువురు తరచూ కొన్ని పనులు చేసి అడ్డంగా బుక్ అవుతారు. తమ ఇమేజ్ ను దారుణంగా దెబ్బేసుకుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం దీనికి పూర్తి భిన్నమైనది. హైదరాబాదీయులు గర్వ పడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. కార్పొరేటర్ అన్నంతనే రాజకీయం తప్పించి మరింకేమీ ఉండదన్న మైండ్ సెట్ ను మార్చేస్తుందీ ఉదంతం. హైదరాబాద్ కు చెందిన విజయనగర కాలనీ కార్పొరేటర్ గా వ్యవహరిస్తున్నారు మజ్లిస్ పార్టీకి చెందిన డాక్టర్ మహమ్మద్ ఖాసిం. మజ్లిస్ కు చెందిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ తో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రాకు గురువారం బయలుదేరి వెళ్లారు.

వీరు ప్రయాణించే ఇండిగో విమానం శంషాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే.. అదే విమానంలో ఉన్న 30 ఏళ్ల దివ్య తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఆమె ఆరోగ్యం హటాత్తుగా విషమించటంతో విమాన సిబ్బందికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దీంతో ఈ సమాచారాన్ని పైలెట్ కు చేరవేశారు. విమానంలో ఎవరైనా వైద్యులు ప్రయాణిస్తుంటే.. అస్వస్థతకు గురైన ప్రయాణికురాలికి సాయం చేయాల్సిందిగా పైలెట్ అభ్యర్థించారు.

దీంతో స్పందించిన మజ్లిస్ కార్పొరేటర్ డాక్టర్ మహమ్మద్ ఖాసిం.. తాను వైద్యుడినేనని చెప్పారు. ఫ్లైట్ లో ఉన్నఫస్ట్ ఎయిడ్ బాక్సులోని పరికరాలతో సాధారణ పరీక్షలు నిర్వహించారు. అనంతరం తన వద్దనున్న కిట్ తో ప్రాథమిక వైద్యం చేపట్టారు. పావు గంటలో సదరు ప్రయాణికురాలు సాధారణ పరిస్థితికి వచ్చారు. హటాత్తుగా అనారోగ్యానికి గురి కావటానికి కారణం ఆరా తీస్తే.. విమాన ప్రయాణం ఉందన్న ఉద్దేశంతో ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా.. మందుల్ని వేసుకోవటంతో స్ప్రహ కోల్పోయినట్లుగా తేల్చారు.

సకాలంలో స్పందించిన డాక్టర్ కారణంగా ఆమె ప్రాణాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. సరైన సమయంలో స్పందించిన మజ్లిస్ కార్పొరేటర్ ను విమాన సిబ్బందితో పాటు.. ప్రయాణికులు అభినందనల వర్షం కురిపించారు. ఆయన చేసిన పనికి స్పందించిన ఇండిగో విమాన సంస్థ.. ఆయనకు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందించింది. రాజకీయాల్లో ఉన్నప్పటికి వైద్యం తన ప్రొఫెషన్ గా చెప్పే సదరు కార్పొరేటర్ తీరుకు ఫిదా కావాల్సిందే కదూ.
Tags:    

Similar News