ట్యాపింగ్‌ చిక్కుల్లో ముగ్గురు టీ ఐపీఎస్‌లు..?

Update: 2015-06-30 06:01 GMT
ఆ మధ్య హడావుడి చేసిన ట్యాపింగ్‌ ఉదంతం.. నోటుకు ఓటు కేసు మాదిరే కాస్త నెమ్మదించిందన్న వాదనల్ని తుంచేస్తూ.. ఈ అంశంపై ఏపీ సర్కారు నియమించిన సిట్‌.. ఈ విషయంపై తాజా పరిణామాల్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు.. పలువురు ఏపీ ముఖ్యుల ఫోన్లను ట్యాప్‌ చేసిన అంశం నూటికి నూరుపాళ్లు నిజమని సిట్‌ పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా తమకు లభించిన ఆధారాలతో ట్యాపింగ్‌ ఆరోపణలపై పూర్తిస్థాయి పట్టు వచ్చిందని.. తెలంగాణ సర్కారు ఫోన్లను ట్యాప్‌ చేసిందన్న విషయాన్ని బలంగా నిరూపించే వీలు కలుగుతుందని ఏపీ డీజీపీ రాముడుకు ఈ కేసును విచారిస్తున్న డీఐజీ ఇక్బాల్‌ చెప్పినట్లుగా చెబుతున్నారు.

ఈ మధ్యనే విజయవాడలో టెలికం సర్వీసు  ప్రొవైడర్లను పిలిపించి.. విచారణ చేసిన నేపత్యంలో కొన్ని ఆధారాలు లభించాయని చెబుతున్నారు. ట్యాపింగ్‌ ఉదంతం బయటకు రావటంతో మేల్కన్న తెలంగాణ పోలీసులు అధికారులు.. వీటిల్లో  కొన్నింటిని ధ్వంసం చేసినట్లుగా చెబుతున్నారు. ఏపీ పోలీసు ఉన్నతాధికారుల అంచనా ప్రకారం.. ట్యాపింగ్‌ వ్యవహారంలో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు చిక్కుల్లో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం తమ వద్ద ఉందన్న విషయాన్ని డీజీపీ రాముడుకు చెప్పినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ట్యాపింగ్‌ ఉదంతం మొత్తం సాంకేతిక అంశాలతో కూడుకున్న నేపథ్యంలో.. ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా సేకరించాలని.. వాదనను బలంగా ఉండేలా చూసుకోవటంతో పాటు.. ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడాలని సూచించినట్లు చెబుతున్నారు. ట్యాపింగ్‌ విషయంలో తెలంగాణకు చెందిన ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు చిక్కులు తప్పవన్న మాట బలంగా వినిపిస్తోంది. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని ఏపీ పోలీసులు ప్రకటిస్తారా? లేక.. వారిపై చర్యలకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Tags:    

Similar News