కర్నూలు జిల్లాలో ఆ రైతు సుడి తిరిగింది.. అంత ఖరీదైన వజ్రమే దొరికింది

Update: 2021-05-28 05:30 GMT
అదృష్టాన్ని ఆపలేరన్న మాట మరోసారి నిజమైంది. ఎలాంటి ఆశ లేకుండా తన పని తాను చేసుకుంటునన ఒక పేద రైతుకు అదృష్టం తనకు తానుగా వచ్చి తలుపు తట్టిన వైనం ఆసక్తికరంగానే కాదు హాట్ టాపిక్ గా మారింది. కందికొయ్యలు కోస్తున్న సదరు రైతుకు విలువైన వజ్రం దొరికిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వెనుకబడిన జిల్లాగా పేరున్న కర్నూలుకు ఒక సిత్రమైన ఇమేజ్ ఉంది. ఆ జిల్లాలోని తుగ్గలి.. తదితర ప్రాంతాల్లో వజ్రాల రాళ్లు బయటపడుతుంటాయి. అయితే.. ప్రతిసారీ బయటపడే రాళ్ల విలువ ఒక మోస్తరుగా ఉంటుంది. అరుదుగా మాత్రం అదిరే విలువతో కూడిన వజ్రాలు బయటపడుతుంటాయి.

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.  కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చిన్నజొన్నగిరి గ్రామానికి చెందిన రైతు వేరు శనగ విత్తేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్నాడు. అందులో భాగంగా కంది కొయ్యలు తీస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మెరుగు రాయి కనిపించింది. అది వజ్రమన్న విషయాన్ని గుర్తించిన సదరు రైతు వజ్రాల వ్యాపారి ఇంటికి తీసుకెళ్లాడు.

ఆ వజ్రం ఏకంగా 25 క్యారెట్లు ఉన్నట్లుగా తేలటంతో.. అక్కడున్న వజ్రాల వ్యాపారులు ఆ వజ్రాన్ని ‘పాట’ (వేలాన్ని అలా పిలుస్తారు. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి సొంతమవుతుంది) పెట్టారు. ఒక వ్యాపారి రూ.1.20కోట్లు పెట్టి ఆ రాయిని సొంతం చేసుకున్నాడు. దీంతో.. ఆ పేద రైతు సుడి తిరిగిపోయిందని చెబుతున్నారు.

ఏడేళ్ల క్రితం జిల్లాలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఒక రైతుకు రూ.37 లక్షల విలువైన వజ్రం దొరికినట్లుగా చెబుతారు. దాని తర్వాత ఇంత విలువైన వజ్రం దొరకటం ఇదే తొలిసారి అన్న మాట వినిపిస్తోంది. ప్రతి ఏటా తొలకరి వర్షాల వేళలో.. జిల్లాలోని తుగ్గలి ప్రాంతంలో చిన్న.. పెద్ద వజ్రాలు యాభై వరకు లభిస్తాయి. ఇందుకోసం ముంబయి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులే కాదు..ఎర్ర నేలల్లో  రాళ్లు వెతకటానికి వేలాది మంది వస్తుంటారు.
Tags:    

Similar News