మోదీజీ... ఈ 'వ‌ర‌స్ట్‌' మాట విన్నారా?

Update: 2017-08-03 09:30 GMT
న‌రేంద్ర మోదీ భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత దేశంలో పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరిలూదే కార్య‌క్ర‌మానికి తెర లేసింద‌నే చెప్పాలి. మేకిన్ ఇండియా పేరిట ఎర్ర‌కోట నుంచి తాను చేసిన తొలి ప్ర‌సంగంలోనే పారిశ్రామికాభివృద్ధి ఆవ‌శ్య‌క‌త‌ను మోదీ నొక్కి చెప్పారు. దేశంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తి చూపే బ‌హుళ జాతి సంస్థ‌ల‌కు అత్యంత సులువైన మార్గంలో అనుమ‌తులు మంజూరు చేయ‌డ‌మే కాకుండా వారు ఇక్క‌డ ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్య‌క‌లాపాలు సాగించేందుకు అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న‌ట్లు నాడు మోదీ ప్ర‌క‌టించారు. ఇదే క్ర‌మంలో చాలా కంపెనీలు భార‌త గ‌డ్డ మీద‌కు వ‌స్తున్నాయి. ఇక్క‌డే త‌మ త‌యారీ యూనిట్ల‌ను నెల‌కొల్పుతున్నాయి. ప‌రిస్థితి ఇలా ఉంటూ... బిజినెస్ చేసే విష‌యంలో భార‌త్‌ ను వ‌ర‌స్ట్ కంట్రీ అని ఎందుకు అన్నారు? అస‌లు ఈ మాట అన్న‌ది ఎవ‌రు?  

వేరెవ‌రో అయితే అస‌లు ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అంతేకాదండోయ్‌... భార‌త్‌ ను తిడుతూ ఎక్క‌డో వేరే దేశ గ‌డ్డ‌పై ఈ వ్యాఖ్య వినిపించినా పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదేమో. ఎందుకంటే పోటీ ప్ర‌పంచంలో ఒక దేశాన్ని మ‌రో దేశం... అంతెందుకు దేశంలోని ఒక రాష్ట్రాన్ని మ‌రో రాష్ట్రం తిట్టేసుకుంటున్న వైనం మ‌న‌కు కొత్తేమీ కాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు పోరాడుకున్న వైనాన్ని చూసిన మ‌న‌కు ఈ త‌ర‌హా వివాదాలు కొత్త కాక‌పోయినా... మ‌న దేశ గ‌డ్డ‌పై,. మ‌న దేశానికి చెందిన పారిశ్రామిక స‌మాఖ్యకు చెందిన మ‌న దేశ పారిశ్రామిక వేత్త - మ‌న దేశంపై నింద వేస్తే ఎలా ఉంటుంది?  కాలిపోవ‌డం ఖాయ‌మేగా. మ‌రి ఈ వ్యాఖ్య మేకిన్ ఇండియా నినాదం వినిపించిన మోదీకి వినిపించిందో - లేదో తెలియ‌దు గానీ.. ఈ మాట విన్న ప్ర‌తి భార‌తీయుడికి ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెలుచుకుంటోంది.

అయినా అస‌లు విష‌యం చెప్ప‌కుండా... ఈ ఉపోద్ఘాతాలు ఏమిట‌నేగా? అయితే విష‌యంలోకి వ‌చ్చేద్దాం. నిన్న దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో ఇంట‌ర్నెట్ అండ్ మొబైల్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా (ఏఐఎంఏఐ) ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఓ స‌ద‌స్సుకు చాలా మంది ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఐటీ మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అజ‌య్ కుమార్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స‌ద‌స్సులో మైకందుకున్న ఇండియ‌న్ సెల్యూలార్ అసోసియేష‌న్ (ఐసీఏ) అధ్య‌క్షుడు పంక‌జ్ మోహింద్రూ భార‌త్ లో వ్యాపారం చేస్తున్న పారిశ్రామిక‌వేత్త‌ల ఇబ్బందులను ఏక‌రువు పెట్టారు.  ఈ సంద‌ర్భంగా ఆయ‌న భార‌త్ ను వ‌ర‌స్ట్ కంట్రీగా అభివ‌ర్ణించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భార‌త్ అట్ట‌డుగు స్థానంలో ఉంద‌ని ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

దేశంలో క‌స్ట‌మ్స్‌- టాక్సేష‌న్ శాఖ‌ల మ‌ధ్య కించిత్ న‌మ్మ‌కం కూడా లేకుండా పోయింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ రెండు శాఖ‌ల మ‌ధ్య కొర‌వ‌డ్డ స‌మ‌న్వ‌యం కార‌ణంగా పారిశ్రామివేత్త‌లు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తోంద‌ని కూడా ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా ఆదాయ ప‌న్ను శాఖ‌కు ఈ నెల‌లో ఇంత మేర ప‌న్ను వ‌సూలు చేయాల‌ని టార్గెట్లు పెట్ట‌డ‌మేమిట‌ని కూడా ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఇలా కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ముందే దేశంలోని ప‌రిస్థితుల‌పై మోహింద్రూ ఈ త‌ర‌హా వ్యాఖ్య‌లు చేయ‌డం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే మోహింద్రూ చెప్పినంత‌గా ప‌రిస్థితులేమీ దారుణంగా లేవ‌ని అజ‌య్ కుమార్ క‌వ‌ర్ చేసేందుకు చేసిన య‌త్నం పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని తెలుస్తోంది. మ‌రి మోహింద్రూ లేవ‌నెత్తిన ఈ అంశంపై మోదీ స‌ర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News