దిమ్మ తిరిగే వడ్డింపు దిశగా రైల్వేలు..?

Update: 2016-09-08 22:30 GMT
మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక కొన్ని అంశాల విషయంలో మార్పులు భారీగా ఉంటాయన్న భావన వ్యక్తమైంది. విదేశీ వ్యవహారాలు.. రక్షణ.. రైల్వేలు.. నిత్యవసర వస్తువుల ధరలు లాంటి వాటిల్లో మార్పులు రావటం ఖాయమనుకున్నారు. కానీ.. అందుకు భిన్నమైన పరిస్థితి. అంచనాకు.. ఆచరణకు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనిపిస్తోంది. మిగిలిన రంగాల్ని పక్కన పెడితే.. రైల్వేల విషయంలో విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయని.. ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చేలా రైల్వే శాఖ పనితీరు ఉంటుందని భావించారు.

కానీ.. అందుకు భిన్నంగా ఉంది మోడీ సర్కారు  తీరు. రైల్వేల్లో ఇప్పటివరకు అమలవుతున్న విధానాల్ని ఒక దాని తర్వాత ఒకటి చొప్పున చెల్లుచీటి ఇస్తున్న వైనం తెలిసిందే. పిల్లలకు ఉన్న హాఫ్ టికెట్ విధానాన్ని నీళ్లకు వదిలేసిన కేంద్ర సర్కారు.. రాయితీల విషయంలో మరింత కటువుగా వ్యవహరిస్తోంది.  ఆ పేరిట.. ఈ పేరిట అంటూ ఎప్పటికప్పుడు బాదేస్తున్న కేంద్రం.. తాజాగా మరో బాదుడు దిశగా అడుగులు వేస్తోంది.

విమాన ఛార్జీల మాదిరి.. రైల్వేలలో కూడా అదే విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధానంలో సీట్లు అమ్ముడయ్యే కొద్దీ టికెట్ల ధరలు పెరగటం మొదలవుతుంది. ఈ విధానంలో మొత్తం సీట్లలో 10 శాతం సీట్లు అమ్ముడైన తర్వాత నుంచి టికెట్ ఛార్జీని 10 శాతం పెంచుతారు. అంటే.. సీట్లు అమ్ముడయ్యే కొద్దీ ఛార్జీ పెరుగుతుందన్న మాట.

ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకూ రైళ్లలో పది రోజుల కంటే తక్కువ సమయానికి రిజర్వేషన్ టికెట్లు దొరకని పరిస్థితి. ఇలాంటి వేళ.. డైనమిక్ విధానాన్ని అమలు చేసిన పక్షంలో ట్రైన్ జర్నీ ఖరీదైన వ్యవహారంగా మారటం ఖాయం. తొలుత ఈ విధానాన్ని రాజధాని.. శతాబ్ది.. దురంతో ట్రైన్లలో అమలు చేసి.. తర్వాత మిగిలిన రైళ్లలోకి విస్తరించేలా రైల్వేశాఖ ప్లాన్ చేస్తుందని చెబుతున్నారు. అదే జరిగితే.. సామాన్యులకు ఎంతోకొంత అందుబాటులో ఉన్న రవాణా సదుపాయం కాస్తా.. ఖరీదైన వ్యవహారంగా మారటం ఖాయం.
Tags:    

Similar News