మద్యం లొల్లిలు: మందుకొడితే మహారాజులే..

Update: 2020-05-08 05:30 GMT
రెండు నెలలుగా పనులు లేవు. ఇంట్లోనే అందరూ ఉంటున్నారు. సీఎంలు కేసీఆర్, జగన్ ఇచ్చే రేషన్ బియ్యం తింటూ వారు ఇచ్చిన 1500తో కూరగాయలు నిత్యవసరాలు కొని గమ్మున ఊరుకున్నారు. కానీ ఎప్పుడైతే మద్యం షాపులు తెరిచారో జాతర మొదలైంది. 43 రోజుల తర్వాత మందుబాబులు మద్యం షాపుల ముందు కట్టిన క్యూలు అందరిని ముక్కున వేలేసుకునేలా చేశాయి. మందు తాగితే కొట్టే పోలీసులే ఇప్పుడు మద్యం కొనుగోలుకు సెక్యూరిటీ కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

*ప్రభుత్వం ఇచ్చిన 1500 మద్యానికే..
మరి ఇంత కష్టకాలంలో మందుబాబులకు డబ్బు ఎలా పుడుతుంది అంటే సీఎంలు కేసీఆర్, జగన్ లు ఇచ్చిన 1500, 1000 రూపాయలను మద్యానికే తగలేస్తున్నారు జనాలు. ఒకపూట తిండిలేకపోయినా ఉండగలం కానీ.. మద్యం లేకుండా ఉండలేమని ప్రభుత్వం ఇచ్చిన పైసలను ప్రభుత్వానికే సమర్పిస్తున్నారు. ఇక కొంతమంది అప్పులు చేసి మరీ మద్యం కొన్నామని గర్వంగా చెబుతున్నారు. ఇక మరికొందరు తామే ప్రభుత్వానికి మద్యం కొని పన్ను చెల్లిస్తున్నామని.. తామే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారు. అయినా ప్రభుత్వం ఆదుకుంటుంది కదా.. ఓట్లు గెలిపించిన ప్రభుత్వం తమకు తాగడానికి ఆదుకోవాలని.. మా దగ్గర డబ్బులు అయిపోయినా ప్రభుత్వం ఏదో రూపంలో ఇస్తుందన్న ధీమా మందుబాబుల్లో వ్యక్తమవుతోంది.

*మందు తాగి రచ్చ చేస్తున్న మందు బాబులు
మద్యం షాపులు తెరిచిన బుధ, గురువారాల్లో మందుబాబులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. రెండు ప్రమాదాలు, ఓ హత్యాయత్నం, పదుల సంఖ్యలో న్యూసెన్స్ కేసులు పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. చత్రినాకలో మద్యం మత్తులో ఓ మందుబాబు మరో వ్యక్తి గొంతుకోసి హత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ లో భారీగా యాక్సిడెంట్లు అయితే చాలా జరిగాయి. ఇక రికార్డులకు ఎక్కని ఎన్నో మద్యం గొడవలు ఇళ్లల్లో.. కాలనీలో వందల సంఖ్యలో చోటుచేసుకున్నాయి. ఈ రెండు రోజుల్లోనే పోలీసులకు ఇటువంటి కాల్స్ పెరిగిపోయాయట..

*పోలీసులకు తలకు మించిన భారం
పోలీసులంటే అందరికీ హడలే..వారిని చూస్తే కొందరు భయపడుతారు. కానీ మద్యం తాగాక తాగుబోతులు ఎవ్వరి మాట వినరు. వారిని కొట్టలేం.. తిట్టలేం. ఇప్పుడు పోలీసులకు ఈ తాగుబోతులు చుక్కలు చూపిస్తున్నారు. వారిని కంట్రోల్ చేయలేక పోలీసులకు తలప్రాణం తోకలోకి వస్తోంది.  

*కుటుంబాల్లో లొల్లిలొల్లి.. చుక్కలు చూస్తున్నారు.
43రోజుల తర్వాత మద్యం తాగడంతో తాగుబోతులు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. కుటుంబ సభ్యులను, భార్యలను చితక్కొడుతున్నారు. జూబ్లీహిల్స్ కృష్నానగర్ లో తల్లిదండ్రులపై దాడికి దిగిన మందుబాబును నిలవరించడానికి పోలీసులు నానా కష్టపడ్డారు. అయితే తమ వారిపై కేసులు వద్దని కుటుంబ సభ్యులు చెబుతుండడంతో మద్యం మత్తు తగ్గే వరకు స్టేషన్ లో ఉంచి తర్వాత వదిలిపెడుతున్నారు.  ఈ గ్యాప్ లో వారిని కాపలా కాయలేక.. వారి మాటలు, చేష్టలు పోలీసులు తట్టుకోలేక తలలు పట్టుకుంటున్నారు. ఇక కొంత మంది మందుబాబులు పోలీసులే ఎదుట అఘాయిత్యాలకు పాల్పడుతూ వారికి చిక్కులు తెస్తున్నారు. దీంతో వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. మద్యం షాపుల వద్ద కూడా మందు తాగి వచ్చి తాగుబోతులు చేస్తున్న అల్లరి, వాగ్వాదాలు భరించలేకుండా ఉన్నాయి. భౌతిక దూరం, కరోనా నియంత్రణ అసలు లేకుండానే పోవడం విశేషం.
Tags:    

Similar News