బైడెన్ కే జై అంటోన్న భారతీయ అమెరికన్లు

Update: 2020-09-16 17:30 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తోంది. కొద్ది నెలల క్రితం జార్జి ఫ్లాయిడ్ హత్యతో నల్లజాతీయుల్లో నిరసనలు మిన్నంటాయి. ఓ వైపు కరోనాను ట్రంప్ నిర్లక్ష్యం చేశారని అమెరికన్లు భావిస్తున్నారు. హెచ్ 1బీ వీసాలతోపాటు నాన్ అమెరికన్లకు పలు నిబంధనలను ట్రంప్ కఠినతరం చేయడంపై విమర్శలు వచ్చాయి. ఇక, 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం వెనుక రష్యా పాత్ర ఉందని అమెరికా సెనెట్ ఇంటెలిజెన్స్ కమిటీ తేల్చడం ట్రంప్ నకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, డెమొక్రాట్ల అభ్యర్థిగా బరిలో ఉన్న బైడెన్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నాడని పలు సర్వే్లలో వెల్లడైంది. ఇటువంటి పరిస్థితుల్లోనూ నవంబరు 3న జరగునున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ట్రంప్ నకు నిజంగా అగ్నిపరీక్షే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు....తాజాగా ఓ సంస్థ నిర్వహించిన సర్వే ఫలితాలు ట్రంప్ నకు ప్రతికూలంగా వెలువడ్డాయి. రాబోయే ఎన్నికల్లో 66 శాతం మంది ఇండో అమెరికన్లు బైడెన్ వైపే మొగ్గు చూపారు.

అమెరికాలో ఇండో అమెరికన్ల ఓట్లు... అధ్యక్ష పదవిలో ఉన్నవారి గెలుపోటములను కొంతవరకు నిర్దేశించనున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ అమెరికన్లను ఆకట్టుకునేందుకు ట్రంప్, బైడెన్ గట్టిగా ప్రయత్నిస్తు్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాస భారతీయులకు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ, ఏఏపీఐకి చెందిన సంస్థ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. రాబోయే ఎన్నికల్లో 66శాతం మంది భారతీయ అమెరికన్లు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు ఓటేయనున్నారని ఆ సర్వేలో తేలింది. 28శాతం మంది.. మాత్రమే ట్రంప్‌ వైపు మొగ్గు చూపారు. ఇక మిగిలిన 6 శాతం మంది ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సర్వేలో వెల్లడైంది. ట్రంప్‌తో పోలిస్తే.. 70శాతం ఓట్లతో బైడెన్ ముందంజలో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. 2016 ఎన్నికల్లో 77 శాతం మంది భారత అమెరికన్లు హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలుకగా, మాజీ అధ్యక్షుడు ఒబామాకు 84 శాతం మంది మద్దతిచ్చారు. వారితో పోలిస్తే బైడెన్ కు కొంత మద్దతు తగ్గిందని డెమోక్రాట్లు కొంత అసంతృప్తితో ఉన్నారట. దీంతో, మనవారిని మచ్చిక చేసుకోవడానికి డెమోక్రాట్లు కొత్త ప్లాన్ లు వేస్తున్నారట.
Tags:    

Similar News