టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కుట్ర ప‌న్నుతున్నారా..?

Update: 2021-12-20 05:20 GMT
టీఆర్ఎస్ పార్టీలో వ‌ర్గ విభేదాలు మొద‌ల‌య్యాయా..? ప‌లు జిల్లాల్లో ఎమ్మెల్యేల‌కు.. ద్వితీయ శ్రేణి నేత‌ల‌కు మ‌ధ్య కోల్డ్‌వార్ జ‌రుగుతోందా..? ఇటీవ‌ల జ‌రుగుతున్న వ‌రుస ప‌రిణామాలను గ‌మ‌నిస్తే ఇవే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల త‌ర్వాత ఈ విభేదాలు ఎక్కువ అయిన‌ట్లు పార్టీ శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నాయి. ముఖ్యంగా ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని ఎమ్మెల్యేపై మ‌రో వ‌ర్గం కుట్ర ప‌న్నుతోంద‌ని స‌మాచారం.

ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత పార్టీలో లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఖ‌మ్మం జిల్లా త‌ర‌పున బ‌రిలో నిలిచిన టీఆర్ఎస్ అభ్య‌ర్థి తాతా మ‌ధుసూద‌న్ విజ‌యం సాధించారు. త‌న స‌మీప అభ్య‌ర్థి రాయ‌ల నాగేశ్వ‌రావుపై గెలుపొంది ఖ‌మ్మం టీఆర్ఎస్ లో ఉత్సాహం నింపారు.

అయితే అనుకున్న దానికంటే మెజారిటీ త‌క్కువ రావ‌డంపై పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. కాంగ్రెస్ అభ్య‌ర్థికి రావాల్సిన ఓట్ల కంటే ఎక్కువ రావ‌డంతో గులాబీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నాయి. 90 ఓట్లు ఉన్న హ‌స్తం పార్టీ అభ్య‌ర్థికి 200 పైచిలుకు ఓట్లు రావ‌డంతో క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అయితే టీఆర్ఎస్ లోని ఒక వ‌ర్గ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని మ‌రో వ‌ర్గం అంటోంది. ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హ‌రిప్రియ వ‌ర్గ‌మే లోపాయికారీగా కాంగ్రెస్ పార్టీకి స‌హ‌క‌రించింద‌ని ఆరోపిస్తోంది. హ‌రిప్రియ వ‌ర్గం త్వ‌ర‌లో కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని.. అందుకే ఆ పార్టీకి ర‌హ‌స్య మ‌ద్ద‌తు తెలిపింద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.

హ‌రిప్రియ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లినా ఆమె మ‌న‌సు మాత్రం హ‌స్తం పార్టీ వైపే వెళ్లేందుకు మొగ్గు చూపుతోంద‌ని.. అందుకే పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా స‌రిగా అమ‌లు చేయ‌డం లేద‌ని ఆమె వ్య‌తిరేక వ‌ర్గం బాహాటంగానే ఆరోప‌ణ‌లు చేస్తోంది.

ఎమ్మెల్యే హ‌రిప్రియ వ‌ర్గం మాత్రం ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తోంది. తాము పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు క‌ట్టుబ‌డే ఉన్నామ‌ని.. తామంటే గిట్ట‌ని వారే ఈ ఆరోప‌ణలు చేస్తున్నార‌ని ఎమ్మెల్యే వ‌ర్గం వాదిస్తోంది.

త‌మ‌ను పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపేందుకే ఇలాంటి కుట్రలు ప‌న్నుతున్నార‌ని చెబుతున్నారు. ఓట‌ర్ల‌ను కాపాడేందుకే స్వ‌యంగా క్యాంపులు కూడా నిర్వ‌హించామ‌ని.. అయినా క్రాస్ ఓటింగ్ జ‌ర‌గ‌డంలో త‌మ పాత్ర లేద‌ని కుండ‌బ‌ద్ధ‌లు కొడుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ త‌ర‌పున ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీలో ఉన్న నేతే ఇందుకు కార‌ణం అయి ఉండొచ్చ‌న్న అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

రేవంత్ వ‌ర్గంగా గుర్తింపు పొంద‌డంతోనే పార్టీ నుంచి త‌మ‌ను వెళ్ల‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఆ వ‌ర్గ‌మే కావాల‌ని క్రాస్ ఓటింగ్ కు పాల్ప‌డి త‌మ ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈ కుట్ర కోణంలో త‌మ‌ను ఇరికించి వారు బ‌య‌ట‌ప‌డేందుకు చూస్తున్నార‌ని అనుమానం వెలిబుచ్చుతున్నారు.

ఇల్లెందు నియోజ‌క‌వ‌ర్గంలో క్రాస్ ఓటింగ్‌కు పాల్ప‌డిన వారిని గుర్తించేందుకు హ‌రిప్రియ వ‌ర్గం రెండు రోజులుగా తీవ్ర‌స్థాయిలో అన్వేష‌ణ చేస్తున్నారు. ఈ అంశంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా సీరియ‌స్‌గా ఉన్నారు. ఇంటి దొంగ‌ల‌ను ప‌ట్టుకోవాల‌ని సూచించారు. మొత్తంమీద ఎవ‌రిని ఎవ‌రు ప‌ట్టుకుంటారో.. ఎవ‌రు దోషులుగా తేలుతారో.. ఈ విష‌యం ఎటుతిరిగి ఎటు వెళుతుందో వేచి చూడాలి.



Tags:    

Similar News