మన వ్యాక్సిన్లను అమెరికా గుర్తించలేదా?

Update: 2021-05-30 08:30 GMT
ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్నవి మూడు వ్యాక్సిన్లు. అందులో ఈ మధ్యనే వచ్చిన స్ఫూత్నిక్ - వీ అందరికి అందుబాటులో రాలేదు. మిగిలిన రెండు వ్యాక్సిన్లలో ఒకటి కొవీషీల్డ్ అయితే.. మరొకటి కొవాగ్జిన్. ఈ రెండు వ్యాక్సిన్లే ఇప్పటివరకు దేశంలో అత్యధికులు వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ వ్యాక్సిన్లు వేసుకొని అమెరికాకు వెళితే.. ఆ దేశం గుర్తించటం లేదన్న చేదు నిజం ఇప్పడు చాలామందికి షాకిస్తోంది. దీనికి కారణం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రెండింటిని గుర్తించకపోవటమేనని చెబుతున్నారు.

మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే వారిలో ప్రధానంగా ఉద్యోగంలో భాగంగా.. రెండోది ఉన్నత విద్య కోసం వెళుతుంటారు. ఇలా వెళ్లే వారు.. దేశంలో అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటి వేసుకున్నా.. వాటిని అమెరికాలోని  ఎఫ్ డీఏ (ఆహార.. ఔషద నియంత్రణ సంస్థ) గుర్తించటం లేదన్న చేదు నిజం ఇప్పుడు పలువురు ప్రస్తావిస్తున్నారు. టీకాలు వేసుకొని మాత్రమే రావాలని అమెరికాలోని పలు వర్సిటీలు స్పష్టం చేస్తున్నాయి.

అదే సమయంలో మన దగ్గర లభ్యమయ్యే కోవీ షీల్డ్.. కొవాగ్జిన్ ను అమెరికాలోని ఎఫ్ డీఏ గుర్తించకపోవటంతో ఇప్పుడో సమస్యగా మారింది. మొదట్లో దీన్నో సమస్యగా ప్రభుత్వం గుర్తించలేదని చెబుతున్నారు. తీవ్రత అంతకంతకూ పెరిగి.. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చిన తర్వాత కేంద్రం మేల్కొన్నట్లు చెబుతున్నారు. వ్యాక్సిన్ విషయంలో భారత విద్యార్థులకు మినహాయింపు ఇవ్వాలని వివిధ దేశాలతో చర్చలు జరుపుతోంది.

మరోవైపు.. తమ వ్యాక్సిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించేందుకు వీలుగా అందుకు అవసరమైన పత్రాల్ని భారత్ బయోటెక్ ఇప్పటికే అందజేసింది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఆగస్టు నాటికి.. కొవాగ్జిన్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికిప్పుడు అయితే ఇబ్బందే కానీ.. అమెరికాకు వెళ్లేందుకు కాస్త సమయం ఉందన్న వారికి ఇబ్బందులు ఉండవన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News