అఖిలేష్ పై ప్రియాంక అనుమానం నిజమేనా?

Update: 2019-05-02 11:45 GMT
యూపీలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ సాధిస్తే ఢిల్లీలో వారిదే పీఠం అనేది ఎప్పటి నుంచో ఉన్న నానుడి. పోయిన 2014 ఎన్నికల్లో 72 సీట్లను సాధించి కేంద్రంలో బీజేపీ ఒంటిచేత్తో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అక్కడ పోరాడుతోంది. కానీ యూపీలోని ప్రధాన ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాదీ మాత్రం ఇప్పుడు బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న వాదనకు బలం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇదే విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ నేత ప్రియాంక లేవనెత్తడంతో హాట్ టాపిక్ గా మారింది.

బీజేపీ ఓటు బ్యాంకును కాపాడేందుకు ఎస్పీ పలు చోట్ల బలహీన అభ్యర్థులను బరిలోకి దింపిందని తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. పలు చోట్ల అభ్యర్థుల ఉదాహరణలు కూడా చూపించి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ను ఇరకాటంలో పెట్టారు. బీజేపీని గెలిపించడానికి అఖిలేష్ కంకణం కట్టుకున్నారని ప్రియాంక ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది.

తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ-ఆర్ ఎల్డీ కూటమి బీజేపీ పోటీచేస్తున్న పలు చోట్ల బలం లేని అభ్యర్థులను బీజేపీపై పోటీకి దింపింది. అక్కడ బీజేపీ ఓటు బ్యాంకు బలంగా ఉంది. దాన్ని నష్టం చేయకుండా వేరే సామాజికవర్గ నేతలను బరిలోకి దింపడం గమనార్హం. ఎస్పీ, బీఎస్పీ పరస్పరం అభ్యర్థులను మార్చుకున్నారు. దీనిపై ప్రియాంక అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.

అయితే బలహీన అభ్యర్థులను ఎవరూ బరిలోకి దింపరని.. ప్రజాబలం లేనందుకే ప్రియాంక ఇలా మాట్లాడుతున్నారని అఖిలేష్ కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీని ఓడించేందుకే తాము కూటమి కట్టామని స్పష్టం చేశారు.
Tags:    

Similar News