ఫస్ట్ టైమ్ రెడ్ సిగ్నల్ : అమిత్ షా మీటింగ్ కి జగన్ వెళ్ళరా ...?

Update: 2022-08-29 16:49 GMT
దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం సెప్టెంబర్‌3వ తేదీన తిరువనంతపురంలో జరుగనుంది.  30వ దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. ఇక దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. కేరళలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలుగ ఉన్న పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల ముఖ్యమంత్రులు, లెప్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు  హాజరు అవుతారు.

ఒక విధంగా చూస్తే ఇది అత్యంత కీలకమైన సమావేశం. ఆ మధ్యన తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రా ఆతిధ్య పాత్ర పాత్ర పోషించింది. ఈసారి జరిగే  మీటింగులో శాంతిభద్రతలతో పాటు,  దక్షిణాది రాష్ట్రాలలో ఉన్న సమస్యలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కీలకమైన  సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి హాజరవుతారా లేదా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

నిజానికి జగన్ సెప్టెంబర్ 1, 2 తేదీలలో కడప టూర్ పెట్టుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి సందర్భగ్నా ఆయన 2న ఇడుపులపాయలో ఉంటారు. ఇక 3వ తేదీన ఆయన నేరుగా తాడేపల్లికి వస్తారా లేక తిరువంతపురం వెళ్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. లేక కడపలోనే మరో రోజు ప్రోగ్రాం పెట్టుకుంటారా అని కూడా అంటున్నారు.

ఇదిలా ఉండగా దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం గురించి జగన్ మంత్రులతో అధికారులతో తన క్యాంప్ ఆఫీస్ లో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం అజెండాలో ఏమేమి అంశాలు చేర్చాలి అన్న దాని మీద అధికారులకు డైరెక్షన్ ఇచ్చారు. విభజన హామీలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి నిధులు అడగాలని కూడ ఆయన సూచించారు.

అదే విధంగా ఎపుడూ సమస్యల పరిష్కారానికి అది చేస్తామని చెప్పి కేంద్రం చెబుతోందని అలా కాకుండా ఒక పరిష్కార వ్యవస్థ ఏర్పాటు అయ్యేలా ఆ వ్యవస్థ గడువులోగా అన్ని సమస్యలు తీర్చేలా చూడాలని జగన్ కోరారు. ఈ విషయం మీద డిమాండ్ చేయాలని కూడా కోరారు. ఇక దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి రాష్ట్రం నుంచి ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలో ప్రతినిధుల బృందం హాజరు కానున్నట్లు సీఎం జగన్‌ స్పష్టం చేశారు అని చెబుతున్నారు.

అంటే ఈ మీటింగునకు జగన్  తానుగా హాజరు కారా అన్నదే చర్చకు వస్తోంది. ఇప్పటిదాకా జగన్ సీఎం హోదాలో కేంద్రం ఏర్పాటు చేసిన ఏ కీలక సమావేశానికి గైర్ హాజరయింది లేదు. ఆయన అన్ని మీటింగ్స్ కి వెళ్ళి వస్తున్నారు. పైగా మోడీ, అమిత్ షా అధ్యక్షతన జరిగే సమావేశాలు అంటే ముఖ్యమంత్రి ఏ మాత్రం ఆలోచించకుండా వెళ్తారు అని చెబుతారు.

అలాంటిది ఫస్ట్ టై, జగన్ అమిత్ షా మీటింగుకు మంత్రికి సారధ్య బాధ్యతలు అప్పగించడం ఏమిటి అన్నది ఆలోచనలో పడేస్తోంది. దానికి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా లేక రాజకీయ కారణాలే కీలకమా అన్నది కూడా సందేహంగా ఉందిట. ఈ మధ్య బీజేపీ టీడీపీతో కలవాలని తెగ ట్రై చేస్తోంది. దానికి తోడు అమిత్ షా తానుగా  వెళ్ళి మరీజగన్ కి ఏ మాత్రం ఇష్టం లేని మీడియా టైకూన్ ఒకరిని కలసి మంతనాలు జరపడం కూడా వైసీపీని ఇబ్బంది పెట్టేదే అంటున్నారు.

దానికి తోడు జాతీయ వార్తా పత్రికలలో టీడీపీ బీజేపీ బంధం కుదిరిపోయింది అని వస్తున్న వార్తల నేపధ్యంలో జగన్ అమిత్ షా మీటింగునకు కావాలనే  అటెండ్ కావడం లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణా సీఎం కేసీయార్ ఎటూ ఈ మీటింగునకు హాజరు కారు, ఇక తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వెళ్తారా లేదా అన్నది డౌటే. అలా కనుక చూస్తే వారితో పాటే జగన్ కూడా లిస్ట్ లో చేరిపోతారా అన్నది హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. మొత్తానికి బుగ్గన నాయకత్వాన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశానికి అధికారులు  వెళ్ళడం అన్నది కనుక జరిగితే కేంద్రంతో వైసీపీకి గ్యాప్ ఏదో వచ్చినట్లే అనుకోవచ్చు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News