ప‌వ‌న్ క‌ల్యాణ్‌... నిజాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్నారా ?

Update: 2021-07-09 09:30 GMT
ప్ర‌శ్నించేందుకే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న‌నాంటూ ప్ర‌క‌టించి.. య‌మ దూకుడుతో ఏడేళ్ల క్రితం జ‌న‌సేన‌ పార్టీని స్థాపించి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చ‌క్రం తిప్పేందుకు అప్పుడు సిద్ధ‌మైన సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమితమ‌వుతారా? అంటే పవన్ కళ్యాణే పరోక్షంగా అవున‌ని చెప్పేశారు. ఈ విషయాన్ని రాజ‌కీయ వ‌ర్గాలు ఎపుడో తేల్చేశాయి.  తాజాగా హైద‌రాబాద్‌లో ఓ విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట‌లు ఈ అభిప్రాయాల‌ను బ‌ల‌ప‌రిచేవిగా ఉన్నాయి. తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల గురించి ప్ర‌శ్నించ‌గా.. వేల కోట్ల‌తో ముడిప‌డి ఉన్న ప్ర‌స్తుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌లో పార్టీ నిర్మాణం త‌న‌కు క‌ష్ట‌సాధ్య‌మైన ప‌ని అని ఆయ‌న బ‌దులిచ్చారు.  తాను ప‌గ‌టి క‌ల‌లు క‌నే వ్య‌క్త‌ని కాన‌ని, ఉద్య‌మ‌స్ఫూర్తి క‌లిగిన తెలంగాణ నేల‌పై కొత్త ర‌క్తం, చైత‌న్యం క‌లిగిన యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.  

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తాజా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే తెలంగాణ‌లో పార్టీ నిర్మాణం త‌న‌కు త‌ల‌కు మించిన భారంగా మారే వీలుంద‌ని, అందుకే పూర్తిగా ఏపీ రాజ‌కీయాల‌పైనే దృష్టి సారించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. 2014లో పార్టీ స్థాపించిన‌ప్ప‌టి నుంచి ఏపీ రాజ‌కీయాల‌పైనే శ్ర‌ద్ధ పెట్టిన ఆయ‌న‌.. అక్క‌డ స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నారు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇటు రాష్ట్ర స్థాయిలో తెలుగు దేశం పార్టీకి, అటు జాతీయ స్థాయిలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. ఆ పార్టీల త‌ర‌పున ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌తో పాటు క‌ర్ణాట‌క‌లోనూ ప్ర‌చారం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో గెలిచిన టీడీపీ ఇటు రాష్ట్రంలో, బీజేపీ అటు కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాయి. ఇక తెలంగాణ‌లో టీఆర్ఎస్ హ‌వా ఉండ‌టంతో ఆ ఎన్నిక‌ల తర్వాత ఆయ‌న తిరిగి ఇటు చూడ‌లేదు. పార్టీకి సంబంధించి కీల‌క‌మైన క‌మిటీలు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ పెద్ద‌గా క్రియాశీల‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌లేదు.

2018లో తెలంగాణ‌లో ముంద‌స్తు శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయొద్ద‌ని ప‌వ‌న్ నిర్ణ‌యించుకున్నారు. ఆ త‌ర్వాతి ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా ఏపీలో సొంతంగా పోటీ చేసిన జ‌న‌సేన కేవ‌లం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రం గెల‌వ‌గ‌లిగింది. పోటీ చేసిన రెండు చోట్లా ప‌వ‌న్ ఓడిపోయారు.  లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనూ తెలంగాణ‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూపింది లేదు. ఏపీలో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌..  మూడు రాజ‌ధానులు నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించిన ప‌వ‌న్ కేంద్రంలోని బీజేపీతో జ‌ట్టుక‌ట్టారు. ఈ నేప‌థ్యంలో గ‌తేడాది హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ద‌తిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. త‌న పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దించ‌లేదు.  

రాజ‌కీయాల కోసం సినిమాల‌కు విరామం ఇచ్చిన పవ‌న్ క‌ల్యాణ్‌.. ఇప్ప‌డు వ‌రుస‌పెట్టి తిరిగి చిత్రాల్లో న‌టిస్తున్నారు. 'వ‌కీల్‌సాబ్' ఘ‌న విజ‌యంతో జోరు మీద ఉన్న ఆయ‌న‌.. మ‌ళ‌యాల రీమేక్ చిత్రం 'అయ్య‌ప్ప‌నుమ్ కోశియ‌మ్‌'తో పాటు 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' చిత్రాల్లో న‌టిస్తున్నారు. వీటి త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్  దర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు తెలంగాణ‌లో పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టే అవ‌కాశం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోవైపు ఎప్ప‌టిక‌ప్పుడూ తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, వ‌ర్త‌మాన విష‌యాల‌పై వెంట‌నే స్పందించే ఆయ‌న ఈ మ‌ధ్య కాస్త నెమ్మ‌దించార‌నే అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News