చివరి ఆశకూడా పోయిందా ?

Update: 2021-12-16 06:32 GMT
ఈనెల 8వ తేదీ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ చనిపోయారు. సూలూరు ఎయిర్ బేస్  నుండి వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీకి వెళుతున్న సమయంలో హెలికాప్టర్ ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. రావత్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 13 మంది అప్పుడే చనిపోయారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రం తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

90 శాతం కాలిన గాయాలతో చికిత్స తీసుకుంటున్న గ్రూప్ కెప్టెన్ బతికే అవకాశం తక్కువనే అప్పట్లోనే డాక్టర్లు అభిప్రాయపడ్డారు. కాకపోతే అందరిలోను ఎక్కడో కాస్త హోప్ ఉంది. వరుణ్ సింగ్ బతికితేనే  ప్రమాదం ఎలా జరిగిందనే మిస్తరీ విడిపోతుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే జరిగిన ప్రమాదానికి వరుణ్ సింగ్ ఒక్కరే ప్రత్యక్ష సాక్షి కాబట్టి. అలాంటి చివరి ఆశకూడా లేకుండాపోయింది. చికిత్స తీసుకుంటునే వరుణ్ సింగ్ బుధవారం మధ్యాహ్నం మరణించారు.

ప్రమాద కారణాలపై త్రివిధ దళాల నుండి ఉన్నతాస్ధాయి విచారణ జరుగుతోంది. ప్రమాదం జరిగిన రెండురోజుల తర్వాత బ్లాక్ బాక్స్ కూడా దొరికింది. అసలేమి జరిగిందనే విషయం తెలియాలంటే ఇపుడు విచారణ బృందానికి ఉన్న ఏకైక ఆధారం బ్లాక్ బాక్స్ మాత్రమే. ఇందులో కూడా ఏమీ లేకపోతే విచారణ ఎంతకాలం జరిగినా ఉపయోగం లేనట్లే లెక్క. అందుకనే వరుణ్ సింగ్ కోలుకుంటారని, ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని వివరిస్తారని అనుకున్నారు.

ప్రమాదంలో విచారణకు సంబంధించి ఏమి జరిగిందో తెలుస్తుందో లేదో తెలీదు కానీ ప్రస్తుతానికైతే ఎవరిష్టం ప్రకారం వాళ్ళు ఊహాగానాలకు పదును పెడుతున్నారు. ప్రమాదం వెనుక ఏదో కుట్రకోణం దాగుందన్నట్లుగా బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. దాంతోపాటు అనేకమంది ప్రముఖులు ప్రమాదంపై  తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. దాంతో విచారణ బృందానికి అది పెద్ద అవరోధంగా మారింది. అందుకనే ప్రమాదంపై ఊహాగానాలు చేయద్దని అన్నీ వివరాలను ప్రకటిస్తామని త్రివిధ దళాలు అప్పీల్ చేయాల్సొచ్చింది.
Tags:    

Similar News