ఐటీ కూపీ: చంద్ర‌బాబుకు క‌మిష‌న్లు ఇలా అందాయా?

Update: 2020-02-15 00:30 GMT
ఎవ‌రి మీదో ఐటీ రైడ్స్ జ‌రిగితే ఆ విష‌యంలో చంద్ర‌బాబు నాయుడు పేరు ఎందుకు హైలెట్ అవుతూ ఉంది, తెలుగుదేశం పార్టీలో కొంద‌రు చోటా నేత‌ల మీద‌, చంద్ర‌బాబు మాజీ పీఎస్ మీద రైడ్స్ జ‌రిగితే వాటికి చంద్ర‌బాబుతో ఏంటి సంబంధం అంటూ తెలుగుదేశం పార్టీ వాదిస్తూ ఉంది. అయితే దీని వెనుక పెద్ద క‌థే ఉంద‌నే అభిప్రాయాలూ వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఐటీ రైడ్స్ మామూలు విష‌యాలు కావ‌ని, ఈ రైడ్స్ తో ఐటీ శాఖ అధికారుల‌కు మొత్తం వ్య‌వ‌హారంపై క్లారిటీ వ‌చ్చింద‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతూ ఉంది.

ఒక స‌మాచారం ప్ర‌కారం... ఏపీలో కాంట్రాక్టుల‌కు సంబంధించి పెద్ద స్కామ్ ఒక‌టి జ‌రిగింది. ఒక ప్రాజెక్టులో అని కాదు.. చాలా ప్రాజెక్టుల విష‌యంలో పెద్ద‌ల‌కు వాటాలు అందాయ‌నే ఆరోప‌ణ‌లు మొద‌టి నుంచి వ‌స్తున్నాయి. పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టుల‌తో పాటు.. చంద్ర‌బాబు హ‌యాంలో ప‌లు ప్రాజెక్టుల విష‌యంలో కాంట్రాక్టులు, క‌మిష‌న్లు అనే ఆరోప‌ణ గ‌ట్టిగా వినిపించింది. అయితే అందుకు ఆధారాలు లేవు! అంచ‌నాలు పెంచారు, దండుకున్నారు.. అనే టాక్ వినిపించింది.  అందుకూ ఆధారాలు లేవు. క‌మిష‌న్లు వంద‌ల కోట్లు అనే ఆరోప‌ణ వ‌చ్చింది. అయితే ఆ వంద‌ల కోట్ల‌
 రూపాయ‌లు ఎలా చేతులు మారాయంటే మాత్రం ఆధారాలు లేవు.

వాటికే ఇప్పుడు ఐటీ రైడ్స్ ఆధారాలు ల‌భించాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. ఆ క‌థేమిటంటే... స‌బ్ కాంట్రాక్ట‌ర్ల‌ను అడ్డం పెట్టి వ్య‌వ‌హారాన్ని న‌డిపించార‌నేది! ప్ర‌భుత్వ పెద్ద‌లు కాంట్రాక్ట‌ర్ కు భారీగా అంచ‌నాలు పెంచి ప‌నులు క‌ట్ట‌బెట్టారు, ఆ ప‌నులు టెండ‌రింగ్ ప‌ద్ధ‌తి ద్వారా కాకుండా నామినేష‌న్ ప‌ద్ధ‌తి ద్వారా క‌ట్ట‌బెట్టారు, ఆ కాంట్రాక్ట‌ర్ల ఖాతాల్లోకి ప్ర‌భుత్వం నుంచి సొమ్ములు ప‌డ‌తాయి. అందులో అంచ‌నాల పెంపు మొత్తం, క‌మిష‌న్లు కూడా వారి ఖాతాల్లోకి ప‌డ‌తాయి. ఆ డ‌బ్బులో పెద్ద‌ల వాటాను వ్యూహాత్మ‌కంగా చేర్చారు అనే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

ప్ర‌తి పెద్ద కాంట్రాక్టు వ్య‌వ‌హారానికీ కొంత‌మంది స‌బ్ కాంట్రాక్ట‌ర్లను డ‌మ్మీలుగా త‌యారు చేశార‌ని, ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్ డ‌మ్మీ స‌బ్ కాంట్రాక్ట‌ర్ల అకౌంట్ల‌లోకి డ‌బ్బులు వేశార‌ని, అదంతా నాటి ప్ర‌భుత్వ పెద్ద‌ల క‌మిష‌న్ అని.. ఇదే ఐటీ
 రైడ్స్ ద్వారా బయ‌ట‌ప‌డుతూ ఉంద‌నే ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది.

ఆ స‌బ్ కాంట్రాక్ట‌ర్లు ఎలాంటి ప‌నులూ చేయ‌రు. ప‌నులు చేయ‌కున్నా వారి ఖాతాల్లోకి ప్ర‌ధాన కాంట్రాక్టరు డ‌బ్బులు వేస్తాడు. అది కూడా ఒక్కో అకౌంట్లోకి రెండు కోట్ల రూపాయ‌లు లోపు మాత్ర‌మే! అలా చేయ‌డం వ‌ల్ల ఐటీ క‌న్ను గ‌ప్ప‌వ‌చ్చ‌ట‌. న‌కిలీ అడ్ర‌స్ ల‌తో అలాంటి స‌బ్ కాంట్రాక్ట‌ర్ల‌ను క్రియేట్ చేయ‌డం, దండుకోవ‌డం జ‌రిగింద‌ని టాక్. ఐటీ రైడ్స్ లో ఈ గుట్టు బ‌య‌ట‌ప‌డిందట‌. వాస్త‌వానికి ఈ మూలాలు ముంబైలో బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, ఇప్పుడు తెలుగుదేశం అనుకూల వ‌ర్గాల వ‌ద్ద డొంక క‌దిలింద‌ని ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. మ‌రి ఈ క‌థ ఎంత వ‌ర‌కూ వెళ్తుంద‌నేది ఆస‌క్తిదాయ‌కం.
Tags:    

Similar News