నవంబర్​ కాదు జనవరి.. అమెరికాలో టీకా పంపిణీ ఆలస్యం

Update: 2020-11-01 02:30 GMT
నవంబర్​ నాటికి టీకా పంపిణీ చేస్తానని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరగడం లేదు. దీంతో ట్రంప్​ చెప్పిందంతా ఉత్తదే అని తేలిపోయింది. ఎన్నికల్లో లబ్ధికోసం ఈ ప్రకటన చేశాడని ప్రజలు భావిస్తున్నారు. అయితే తాజాగా ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ అండ్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ కీలక ప్రకటన చేశాడు. డిసెంబర్​ చివరినాటికి లేదా జనవరి ప్రారంభం నాటికి అమెరికాలో టీకా పంపిణీ ప్రారంభించే అవకావం ఉన్నదని ప్రకటించారు. సురక్షితమైన, సమర్థవంతమైన కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం తాము కృషి చేస్తున్నామని చెప్పారు.

వ్యాక్సిన్‌ తయారీ కంపెనీలు మోడర్న, ఫైజర్‌లు ఇచ్చిన అంచనాల ప్రకారం రాబోయే కొద్ది వారాల్లోనే తొలి దశ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. హై రిస్క్‌లో ఉన్నవారికి ముందు వ్యాక్సిన్​ ఇస్తామని చెప్పారు. జూలై చివర్లో ఈ రెండు కంపెనీలు చివరిదశ హ్యూమన్​ ట్రయల్స్​ ప్రారంభించాయి. అక్టోబర్‌లో తాత్కాలిక ప్రయోగాల వివరాలను ప్రకటిస్తారని భావించినప్పటికీ, ప్రస్తుతం నవంబరు 3 వ తేదీకి ముందు డేటాను విడుదల చేసే అవకాశం లేదని ఫైజర్‌ తెలిపింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం డేటాని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సమాచారాన్ని అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ సమీక్షించాల్సి ఉంది. దాని ఫలితాల ఆధారంగా ప్రయోగాలు విజయవంతమైతే మొదటి డోస్‌లను ఎవరికి ఇవ్వాలని అనేది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిఫార్సులు చేస్తుంది.
Tags:    

Similar News