కన్నడ నాట సంచలనంగా కేజీఎఫ్ బాబు పై ఐటీ దాడులు!

Update: 2022-05-29 07:30 GMT
యూసఫ్ షరీఫ్ అన్నంతనే చాలామందికి తెలీకపోవచ్చు. కానీ కేజీఎఫ్ బాబు అన్నంతనే ఉమ్రా డెవలపర్స్ యజమాని ఇట్టే గుర్తుకు వచ్చేశారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ పెద్ద మనిషి పార్టీకి ఆర్థిక కొండగా అభివర్ణిస్తారు.

ఆ మధ్య జరిగిన కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన.. రానున్న ఎన్నికల్లో కోలార్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని భావిస్తున్నారు. ఇలాంటివేళలో ఆయన ఇంటిపైనా.. ఆయన సంబంధికుల ఇళ్ల మీద పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగటం ఇప్పుటం సంచలనంగా మారింది.

బెంగళూరులోని వసంతనగర్ లోని ఆయన నివాసంలోనూ.. ఆయనకు చెందిన ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. రెండు దశాబ్దాల క్రితం వరకు కేజీఎఫ్ బాబు ఉనికి పెద్దగా లేదనే చెప్పాలి.

ఎప్పుడైతే కేజీఎఫ్ కు చెందిన పాత సామాగ్రిని కొనుగోలు చేయటం షురూ చేశారో అప్పటి నుంచి ఆయన ఆస్తులు భారీగా పెరిగిపోయాయి. మొన్నటి మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన సమయంలో ఆయన నామినేషన్ కు జత చేసిన ఆస్తుల ప్రమాణ పత్రంలో ఆయన ఆస్తులు ఏకంగా రూ.1745 కోట్లుగా చూపించటంతో చాలామంది విస్మయానికి గురయ్యారు.

ఇంత భారీగా ఆస్తుల్ని  అధికారికంగా చూపించగా.. అనధికారికంగా ఎంత ఉంటుందన్నదో చర్చగా మారింది. 2017- నుంచి 2021 వరకు చూస్తే.. ఆయన ఆదాయం కనిష్ఠంగా రూ.14.89 లక్షలు గరిష్ఠంగా రూ.49.74 లక్షలుగా మాత్రమే చూపించారు. యావరేజ్ గా చూస్తే.. ఏడాదికి రూ.30 లక్షల ఆదాయాన్ని చూపించి.. ఆస్తుల విలువ మాత్రం ఏకంగా వేలాది కోట్లు ఉండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇద్దరు భార్యలున్న కేజీఎఫ్ బాబు.. భారీ స్థాయిలో స్థిరాస్తులు.. వ్యాపారాలు ఉన్నాయి. కానీ.. ఆదాయం మాత్రం అతి తక్కువగా చూపించటంతో ఐటీ శాఖ కన్ను ఇప్పుడు ఆయన మీద పడింది. పెద్ద ఎత్తున నిర్వహించిన సోదాల తర్వాత ఆయన ఇంటి నుంచి ఆఫీసు నుంచి భారీ ఎత్తున ఫైళ్లను స్వాధీనం చేసుకోవటం చూస్తుంటే..రానున్న రోజుల్లో ఆయనకు ఆర్థిక పరమైన కేసుల చిక్కులు తప్పవన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News