కోడికత్తి కేసులో జగన్ కోర్టుకు వెళ్లాల్సిన టైమొచ్చినట్లే

Update: 2023-01-14 05:30 GMT
రెండు తెలుగురాష్ట్రాల్లో సంచలనంగా మారిన కోడికత్తి కేసుకు సంబంధించిన వైనం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన న్యాయవిచారణ విజయవాడలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా సదరు న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కోడికత్తి కేసులో బాధితుడైన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తొలుత సాక్షిగా విచారించకుండా.. మిగిలిన సాక్ష్యుల్ని విచారిస్తే ఏం ప్రయోజనం? అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది.

విచారణకు సిద్ధం చేసిన సాక్ష్యుల జాబితాలో బాధితుడి పేరు చేర్చి.. కోర్టు ఎదుట హాజరుపర్చేలా చూడాలని ఎన్ఐఏ తరఫు న్యాయవాదినిఆదేశాలు జారీ చేసింది. 2018 అక్టోబరులో విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి జరగటం.. అనంతరం హైదరాబాద్ కు వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందటం తెలిసిందే. దీనికి సంబంధించిన అభియోగపత్రాన్ని 2019 ఆగస్టులో కోర్టుకు దాఖలు చేశారు.

ఇందులో మొత్తం 56 మందిని సాక్ష్యులుగా పేర్కొన్నారు. విచారణ కోసం సిద్ధం చేసిన లిస్టులో పది పేర్లను పొందుపరిచి.. వారి విచారణకు షెడ్యూల్ ఖరారు చేసే అభ్యర్థనను కోర్టు ముందు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ కోర్టులో ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావుకు చెందిన న్యాయవాది సలీం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. విచారణ జరపాల్సిన జాబితాలో బాధితుడి పేరు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు.

పది మంది సాక్ష్యుల్ని విచారించాల్సిందిగా కోర్టును కోరగా.. న్యాయమూర్తి ఆంజనేయమూర్తి ఎన్ఐఏ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.."ఈ కేసులో బాధితుడు (ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి) సాక్ష్యం విలువైనది. అది లేకుండా మిగిలిన వారిని విచారించలేం. కోర్టు టేప్ రికార్డరుగా ఉండదు. బాధితుడి వాంగ్ములం ఉండాలి కదా?" అని పేర్కొన్నారు.

ఈ కేసు విచారణను జనవరి 31 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితుడు జనపల్లి శ్రీనివాసరావుకు ఎన్ఐఏ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. నాలుగున్నరేళ్లుగా రిమాండ్ లో ఉన్న కోడికత్తి శ్రీనుకు కోర్టు బెయిల్ రిజెక్టు చేయటం ఇది ఏడోసారిగా చెబుతున్నారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా అతడి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరి.. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం జగన్ కోర్టుకు ఎప్పుడు హాజరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News