అలా చేయ‌లేదు కాబ‌ట్టే సీఎం కాలేదు

Update: 2017-02-04 05:58 GMT
మూడు రోజుల పర్యటన నిమిత్తం త‌న సొంత జిల్లా క‌డ‌ప‌కు వెళ్లిన వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత - ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. కడపలో నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు - జడ్పీటీసీలు - ఎంపీటీసీలు - కౌన్సిలర్లు - కార్పొరేటర్లు తదితర ప్రముఖ నాయకులతో వేర్వేరుగా సమావేశం అయ్యారు. జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు. ఒక నియోజకవర్గం ముగిసిన తర్వాత మరో నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహిస్తూ వచ్చారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్యాలు చేశారు. అబద్దాలతో అధికారం దక్కించుకున్న అధికార పార్టీ ప్రజలను మోసం చేస్తోందని, అమాయక ప్రజలను ప్రలోభపెట్టి అధికారంలో కొనసాగుతుందని పరోక్షంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును, తెలుగుదేశం పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఎంగిలి కూడు తిని ఉంటే తాను ఎప్పుడో సీఎం అయ్యేవాడినని కానీ ఒకరు తిని వదిలేసిన అన్నాన్ని తాను తినదలుచుకోలేదని కారణంగానే సీఎంగా అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల ఆమోదంతోనే ముఖ్యమంత్రి కాదల్చుకున్నానని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

పార్టీ నేత‌లు - ప్రజాప్రతినిధులు మాట్లాడిన అనంతరం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలకు ద్రోహం చేయడం తనకు నచ్చదన్నారు. ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పోరాడి ప్రజా మన్ననలతో ఎన్నికల్లో నెగ్గి వారి ఆదరాభిమానాలతో సీఎం పీఠం ఎక్కడమే లక్ష్యమన్నారు. అధికార పీఠం కోసం అబద్దపు వాగ్దానాలు చేయనన్నారు. ఏవైతే సాధ్యపడతాయో ప్రజలకు పూర్తిగా ఉపయోగపడతాయో అవి ఎంత కష్టతరమైనప్పటికీ వాటిని సాధించి ప్రజలకు మేలు చేకూరుస్తానని పేర్కొన్నారు. అంతే కానీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి మరో మాట మాట్లాడే తత్వం తనది కాదని ఆయన వివరించారు. తాను సీఎం కావాలని అనుకుని ఉంటే ఎప్పుడో సీఎం అయి ఉండేవాడినని కానీ కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాన‌ని జ‌గ‌న్ చెప్పారు. వైఎస్‌ మరణానంతరం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతి కుటుంబాన్ని ఓదార్చానని ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నానని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎన్నో ఉద్యమాలు - ఆందోళనలు చేస్తూ ప్రజాభిమానాన్ని కూడగట్టుకునేందుకు శ్రమిస్తున్నానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలను నెరవేర్చేందుకు ప్రజల ఆశీస్సుల కోసం ప్రజల వద్దకు వెళుతున్నానని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వివరించారు.

ఇదిలాఉండ‌గా... వైఎస్ జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మైన తీరును ప‌లువురు పార్టీ నేత‌లు ప్ర‌శంసించారు. ఒక్కో నియోజకవర్గంపై దాదాపు ఒక గంట పాటు దృష్టి సారించి ప్రజాప్రతినిధులతో చర్చించడమే కాకుండా వారి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. పలువురు ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడించారు. వేదికపై కుర్చీలో కూర్చోకుండా రచ్చబండ తరహాలో స్టేజిపైనే కూర్చుని ఆయన నియోజకవర్గాల వారీగా ప్రజాప్రతినిధులతో సమీక్ష జరప‌డం విశేషం. జ‌గ‌న్ తాను మాట్లాడడం కంటే ఎక్కువ సేపు ప్రజాప్రతినిధులతోనే మాట్లాడించారు. వారి నియోజకవర్గాల్లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉందనే విషయంగా మాట్లాడించారు. ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలపాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. దీంతో ప్రజాప్రతినిధులు ఉన్నది ఉన్నట్లు ఆయన ముందు నియోజకవర్గ సమాచారాన్ని ఉంచారు. చాలా మంది ఎంపీటీసీలు - జడ్పీటీసీలు - కౌన్సిలర్లు - కార్పొరేటర్లు తమ అభిప్రాయాలను తెలిపారు. తమ తమ నియోజకవర్గాల్లో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టు ఉందని, ముఖ్యంగా జగన్ మోహన్‌ రెడ్డి నాయకత్వంపైన ప్రజల్లో విశ్వాసం ఉందని ఆయన ఎంత కష్టపడుతున్నాడో అనే విషయంగా చర్చ జరుగుతోందని ప్రజాప్రతినిధులు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమకు తెలియని టెక్నాలజీని తీసుకువచ్చి గ్రామాలను బాగు పరుస్తానని చెబుతున్నాడని, కానీ ఆ టెక్నాలజీని నేర్చుకునే అంతటి సామర్థ్యం తమకు ఉందా అని వారు ప్ర‌శ్నించారు. మాటలు తప్ప చేతల్లో ఎటువంటి కార్యక్రమాలు చూపెట్టడం లేదని విమర్శించారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసని అంత సులభంగా ప్రజలు నమ్మరని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు చెప్పే విషయాలన్నింటినీ కూడా జగన్ ఎంతో ఓపికతో వినడంతో పాటు మధ్య మధ్యలో కొన్ని విషయాల పట్ల తన అనుమానాలను నివృతి చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News