నోట్ల రద్దుపై బాబుపై జగన్ షాకింగ్ ఆరోపణలు

Update: 2016-12-16 07:51 GMT
పెద్దనోట్ల రద్దు అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీ విపక్ష నేత కమ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నోట్ల రద్దు వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ముందే తెలుసన్న ఆయన.. ఈ అంశంపై తాను క్రెడిట్ తీసుకుందామన్న ఉద్దేశంతోనే ముందస్తుగా ప్రధాని మోడీకి లేఖ రాశారన్నారు. నోట్ల రద్దు ప్రక్రియ సాఫీగా సాగి ఉంటే.. అదంతా తన క్రెడిట్ అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించే వారన్న జగన్.. మరికొన్ని కీలక ఆరోపణలు చేశారు.

రద్దు నిర్ణయం తర్వాత పరిణామాలు సరిగా జరగని కారణంతో.. మోడీ బ్యాడ్ అని చంద్రబాబు అంటున్నారన్న జగన్.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం ముందుగా తెలియటంతో బాబు అండ్ కో ముందుగానే అంతా సర్దేసుకున్నారన్నారు. నోట్ల రద్దుకు సరిగ్గా రెండు రోజుల ముందు హెరిటేజ్ షేర్లను.. ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేసిన వైనాన్ని జగన్ గుర్తు చేశారు.

ఐటీ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాదిరూపాయిలు దొరుకుతున్నాయని.. రూ.2వేల కోసం సామాన్యులు గంటల కొద్దీ సమయం బ్యాంకుల వద్ద నిలుచోవాల్సి వస్తోందంటూ ఆవేనద వ్యక్తం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం పేదల మీద పోరాటమా? లేక.. పేదల్ని కూడా పన్ను పరిధిలోకి తీసుకురావాలన్న ఆరాటమా? అని ఆయన ప్రశ్నించారు.

పెద్దనోట్ల రద్దు నిర్ణయం నల్లధనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం ఎంతమాత్రం కాదని.. పన్ను పరిధిలోకి మరింతమందిని తీసుకొచ్చే ప్రయత్నంగా జగన్ అభివర్ణించారు. రద్దు అయిన పెద్దనోట్లలో రూ.14.5 లక్షల కోట్లకు ఇప్పటికే రూ.13లక్షల కోట్ల వెనక్కి వచ్చేశాయని.. ఈ నెలాఖరు నాటికి మిగిలిన మొత్తం కూడా వెనక్కి వచ్చేసే అవకాశం ఉందని జగన్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుపై జగన్ విమర్శలు ఎలా ఉన్నా.. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించటానికి రెండు రోజుల ముందు బాబుకు చెందిన హెరిటేజ్ ను ఫ్యూచర్ గ్రూపుకు అమ్మిన వైనంపై ఆయన సంధించిన ఆరోపణలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. కొత్త సందేహాలకు తావిచ్చేలా మారుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News