తెలుగు అకాడమీ పేరు మార్చిన జగన్ సర్కార్ .. కొత్త పేరు ఏంటంటే ?

Update: 2021-07-10 11:30 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. తెలుగు అకాడమీ పేరుని మార్చేస్తూ కీలక నిర్ణయం వెల్లడించింది.  తెలుగు అకాడమీ పేరు ను  చేసింది ఏపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమీగా మార్పు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే  తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌ లర్‌ ను అకాడమీలో పాలకవర్గ సభ్యుడిగా నియమించింది ప్రభుత్వం. దీనితో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఇకపై తెలుగు అకాడమీ పేరు ఎక్కడా కనిపించే అవకాశం లేదు. టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు అప్పట్లో తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు ప్రభుత్వాలు తెలుగు అకాడమీనే కొనసాగించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత  తెలుగు అకాడమీ పేరును మార్చేసింది. అయితే , ఈ నిర్ణయంపై విపక్షాలు, భాషాభిమానులు మండిపడుతున్నాయి.  

ఇక, అకాడమీ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌లో నలుగురిని నియమించింది ఏపీ ప్రభుత్వం. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ డి. భాస్కర రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకుడు డాక్టర్‌ నెరేళ్ల రాజ్‌కుమార్‌, గుంటూరు జేకేసీ కాలేజీ తెలుగు రిటైర్డ్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎం విజయశ్రీ, ఎస్‌ ఆర్‌ ఎస్‌ వి బీఈడీ కాలేజికి చెందిన లెక్చరర్‌ కప్పగంతు రామకృష్ణను అకాడమీ బోర్డుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌ మురళీధర శర్మను యూజీసీ నామినీగా నియమించింది. ఇక, తెలుగు, సంస్కృత అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

తెలుగు భాష అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా తెలుగు అకాడమీ విశేషంగా కృషి చేసింది. రెండు రాష్ట్రాలు వేరయినా తర్వాత ఇంకా విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చి నెలలో తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని, సుప్రీం ధర్మాసనం ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ వివాదం ఇంకా తేల్చకుండానే ఈ సమయంలో తెలుగు అకాడమీ పేరు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం భాషాభిమానులకు అశనిపాతంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News