అమరావతి పై జగన్ సర్కారు దాఖలు చేసిన అఫిడవిట్ లో ఏముంది?

Update: 2022-04-03 09:33 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిలిచిపోయిన ప్రధాన మౌలిక వసతుల పనులను న్యాయస్థానం చెప్పినట్లుగా నెలలో పూర్తి చేయటం సాధ్యం కాదని.. అందుకు అరవై నెలలు (ఐదేళ్లు) కావాలంటూ హైకోర్టుకు తెలిపింది జగన్ ప్రభుత్వం.

రాజధాని కేసుల్లో మార్చి మూడున హైకోర్టు ఇచ్చిన తీర్పులో.. సీఆర్ డీఏ పరిధిలో ప్రధాన మౌలిక వసతులను నెలలో కల్పించాలని.. డెవలప్ చేసిన స్థలాల్ని రైతులకు మూడు నెలల్లో ఇవ్వాలని.. ఆరు నెలల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని హైకోర్టు పేర్కొనటం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ హైకోర్టులో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించారు. అందులో ప్రభుత్వం ఏం చెప్పిందన్న విషయాన్ని చూస్తే..

-  కోర్టు చెప్పిన గడువు లోపు మొత్తం రాజధాని నగరం.. సీఆర్ డీఏ ప్రాంతాన్ని డెవలప్ చేయటం.. ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం సాధ్యం కాదు. ప్రభుత్వం చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలు.. నెరవేర్చాల్సిన లక్ష్యాలు ఉన్నాయి. వాటికే చాలా డబ్బులు కావాలి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం.. సీఆర్ డీఏ ప్రాంతం డెవలప్ మెంట్ కు ఏళ్ల సమయం పడుతుంది.

-  రాష్ట్రానికి పరిమితమైన ఆర్థిక వనరులే ఉన్నాయి. అనేక సంక్షేమ.. డెవలప్ మెంట్ ప్రోగ్రాంలు ఉన్నాయి. అందుకే.. నిర్దిష్ట గడువుకు లోబడి పనుల్ని పూర్తి చేయలేం. ఇంత టైంలో ఇంత డబ్బు ఖర్చు పెడతామని కానీ.. పలానా సమయంలో ఇంత డెవలప్ మెంట్ చేస్తామని కానీ చెప్పలేని పరిస్థితి.

-  రైతులతో సీఆర్ డీఏ చేసుకున్న ఒప్పందంలోని నిబంధనల ప్రకారం డెవలప్ చేయటం రాజధాని నగరానికే పరిమితం. సీఆర్ డీఏ తుది మాస్టర్ ప్లాన్ ఇంకా ఖరారు కాలేదు. ముసాయిదా ప్రణాళికను 2015 డిసెంబరు 26న నోటిఫై చేస్తే.. 12,263 అభ్యంతరాలు వచ్చాయి. వాటిలో పరిష్కరించాల్సినవే చాలా ఉన్నాయి.

-  వివిధ స్థాయిల్లో నిలిచిపోయిన కాంట్రాక్టు పనుల్ని పునరుద్ధరించటానికి టైం పొడిగిస్తూ కాంట్రాక్టర్లతో ఒప్పందాల్ని రివైజ్ చేసుకోవాలి. వివిధ ఆర్థిక సంస్థల నుంచి రుణాలు వస్తాయన్న ఉద్దేశంతో.. పలు పనులు ప్రారంభించారు. ఆ ప్రతిపాదనలు ఏవీ ఫలవంతం కాలేదు.

-  మౌలిక సదుపాయాలు.. డెవలప్మెంట్ పనుల కోసం రూ.1.09 లక్షల కోట్లు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసింది. రూ.62,625 కోట్ల అంచనాలతో డీపీఆర్ సమర్పించాం. కేంద్రం దానిపై స్పష్టత కోరింది. ఆ వివరాలు ఇచ్చే పనిలో ఉన్నాం.

- రాజధాని డెవలప్మెంట్ కోసం ఐదేళ్ల సమయం పడుతుందని అఫిడవిట్ లో చెప్పటమే కాదు.. అదెలా? అన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఐదేళ్ల కాలం ఎలా? అన్న విషయానికి వస్తే.. గుత్తేదారు సంస్థలు గడువు పొడిగింపు ప్రతిపాదనలు సమర్పించేందుకు.. వాటిపై చర్చించి.. ఆమోదించి.. అనుబంధ ఒప్పందం చేసుకోవటానికే 2 నెలల సమయం.. సర్వే.. డిజైన్లు పూర్తికి 4 నెలలు.. యంత్రాలు.. మానవ వనరుల సమకూర్చుకోవడానికి రెండు నెలలు.. రహదారుల నిర్మాణానికి 16 నెలలు.. రోడ్ల పని అయ్యాక.. నీటి సరఫరా.. మురుగు రవాణా వ్యవస్థ.. విద్యుత్ తదితర పనులకు 36 నెలలు.. ఇలా మొత్తం ఐదేళ్ల కాలం అవసరమవుతుందన్న విషయాన్ని పేర్కొన్నారు.

-  రాజధాని ప్రాంతంలో భూ సమీకరణ ద్వారా సేకరించటం సాధ్యం కాని 2630 ఎకరాల భూసేకరణ ప్రక్రియ షఉరూ చేశామని.. 2100 ఎకరాల విషయంలో ముసాయిదా ప్రకటన జారీ చేశామని.. 191 ఎకరాల విషయంలో అవార్డు జారీ చేశాం. భూసేకరణ ప్రక్రియపై చాలా వ్యాజ్యాలు హైకోర్టు దాఖలయ్యాయి.

-  ఉండవల్లి.. పెనుమాక గ్రామాలకు సంబంధించి గతంలో భూసమీకరణలో తక్కువ మంది భూములు ఇచ్చారు. మిగిలిన భూముల్ని భూసేకరణలో తీసుకోవటానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కోర్టులో కేసులు నమోదయ్యాయి. రైతులకు స్థలాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి కాలేదు. 643 ఎకరాలకు సంబంధించి రైతులకు ప్లాట్లు ఇవ్వటానికే ఆర్నెల్లు సమయం పడుతుంది.
Tags:    

Similar News