అతికేలా లేని జానా క‌వ‌రింగ్!

Update: 2018-11-10 04:15 GMT
కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా బండ‌బూతులు తిట్టుకున్న బాబును ఇప్పుడు త‌మ అక్కున చేర్చుకోవ‌టం... ఆయ‌న పార్టీతో క‌లిసి పోటీ చేయ‌టాన్ని కాంగ్రెస్ నేత‌లు ఇప్ప‌టికీ జీర్ణించుకోలేని ప‌రిస్థితి. అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లుగా కొన్ని పార్టీల‌తో చెలిమి చేయ‌టం.. త‌ర్వాతి కాలంలో ఛీ కొట్ట‌టం రాజ‌కీయ పార్టీల‌కు మామూలే అయిన‌ప్ప‌టికీ.. బాబుతో పొత్తును ఎలా స‌మ‌ర్థించుకోవాలో అర్థం కాక కాంగ్రెస్ నేత‌లు కిందా మీదా ప‌డుతున్నారు.

అధినాయ‌క‌త్వం తీసుకునే నిర్ణ‌యాల‌పై త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేసే ద‌మ్ము ఈనాటి  కాంగ్రెస్ నేత‌ల్లో త‌క్కువ‌నే చెప్పాలి. త‌మ మ‌న‌సులో వ్య‌తిరేక‌త ఉన్నా.. పార్టీ నిర్ణ‌యానికి త‌గ్గ‌ట్లుగా గుడ్డిగా ఫాలో కావ‌టం కాంగ్రెస్ నేత‌ల్లో అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం ఎక్కువ‌న్న పార్టీకి ఉన్న ఇమేజ్ కు త‌గ్గ‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

బాబుతో పొత్తు విష‌యంపై ఎవ‌రి దాకానో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానారెడ్డి లాంటి పెద్ద మ‌నిషి సైతం తెగ ఇబ్బంది ప‌డే ప‌రిస్థితి. విలేక‌రుల స‌మావేశంలో మాట వ‌ర‌స‌కు అడిగిన ప్ర‌శ్న‌కు భుజాలు త‌డుముకున్న పరిస్థితిని చూస్తే.. హ‌స్తం పార్టీ నేత‌ల అవ‌స్థ‌లు ఎంత‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. మ‌హాకూట‌మి మొత్తం బాబు చేతుల్లో న‌డుస్తుంద‌న్న మాట‌పై జానా తెగ సీరియ‌స్ అయ్యారు.

అది అర్థం లేని నాన్సెన్స్ మాట‌లుగా కొట్టి పారేశారు. టీఆర్ ఎస్ నేత‌లు ప‌ని కట్టుకొని ఆరోపించినంత మాత్రాన త‌మ‌కు ఎలాంటి ఇబ్బంది ఉంద‌న్న ఆయ‌న‌.. పొత్తుల క‌మిటీ ఛైర్మ‌న్ తాను కాన‌ని.. కేవ‌లం పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని సూచన‌తోనే తాను టీజేఎస్‌.. సీపీఐ.. టీడీపీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా పేర్కొన్నారు. జానా తీరు చూస్తే టీడీపీ పేరును సైతం ప‌ల‌క‌టానికి పెద్ద ఇష్టం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించటం గ‌మ‌నార్హం.

తెలంగాణ అభివృద్ధిలో బాబు జోక్యం ఉండ‌ద‌న్న జానా.. ఎట్టి ప‌రిస్థితుల్లో అలాంటివి స‌హించేది లేద‌న్నారు. బాబుతో మాట్లాడి ఒప్పించే ధైర్యం కేసీఆర్‌కు లేద‌న్న ఆయ‌న‌.. గ‌తంలో పోల‌వ‌రంతో పాటు మ‌హారాష్ట్ర.. క‌ర్ణాట‌క ప్రాజెక్టుల‌పై కేసీఆర్ లేఖ‌లు రాలేదా? అని ప్ర‌శ్నించారు.  ఇదంతా ఒక ఎత్తు అయితే.. బాబును క‌లిసేందుకు కాంగ్రెస్ నేత‌లంతా వెయిట్ చేశార‌ని.. అలాంటి ప‌రిస్థితి ఎందుకొచ్చింద‌న్న ప్ర‌శ్న‌కు జానాకు చ‌ర్రున కోపం పొడుచుకొచ్చింది.

తామేమీ బాబు ఇంటికి కానీ.. ఆఫీసుకు కానీ వెళ్ల‌లేద‌ని.. ఆయ‌నే త‌మ పార్టీ అధినేత రాహుల్ ఇంటికి వ‌చ్చార‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దన్నారు. రాహుల్ ఇల్లంటే త‌మ ఇల్లేన‌ని.. బాబు అక్క‌డ‌కు వ‌చ్చారుకాబ‌ట్టే క‌లిశామే త‌ప్పించి.. తాము బాబు కోసం వెయిట్ చేయ‌లేద‌ని స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేయ‌టం గ‌మ‌నార్హం. జానా ఎంత క‌వ‌ర్ చేసినా.. ఆయ‌న మాట‌ల్లో బాబుకు త‌మ‌కు మ‌ధ్య దూరం ఉంద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు కిందా మీదా ప‌డుతున్న వైనం క‌నిపించ‌క మాన‌దు. ఓవైపు పొత్తు పెట్టుకొని.. మ‌రోవైపు అదంతా ప‌రిమిత‌మైన పొత్తు అంటూ జానా సాబ్ చేస్తున్న‌ క‌వ‌రింగ్ పెద్ద‌గా క‌వ‌ర్ అయిన‌ట్లుగా అనిపించ‌లేద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.  


Tags:    

Similar News