పవన్ లో ఫీల్ మిస్ అయ్యేలా జనసేన 4 ట్వీట్లు

Update: 2021-03-28 03:57 GMT
ఇష్టం లేని పనిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్నారా? మనసుకు నచ్చిందే చేస్తా.. స్వతంత్రంగా వ్యవహరిస్తా.. ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదు.. ప్రజలు మాకు బాసులు అని చెప్పే జనసేన అధినేత తాజాగా అలాంటిదేమీ చేయలేకపోతున్నారు. మనసుకు నచ్చని పని  చేయాల్సి రావటంతో మొక్కుబడిగా మమ అనిపిస్తున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది. తిరుపతి లోక్ సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీతో పోలిస్తే.. జనసేనకే ఎక్కువ బలం ఉంది. ఇక్కడ తమ పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని పవన్ అనుకున్నారు కానీ.. కమలనాథుల రిక్వెస్టు కారణంగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. అన్యమనస్కంగానే కమలనాథులకు ఓకే చెప్పినట్లుగా చెబుతారు.

నచ్చిన పనిని ఎంతో ఇష్టంగా చేస్తుంటారు. అందునా పవన్ లాంటి నేత.. నచ్చని పని చేసేటప్పుడు ఎలా ఉంటారన్న దానికి నిదర్శనంగా తాజాగా జనసేన పార్టీ పోస్టు చేసిన ట్వీట్లను చూస్తే అర్థమవుతుందని చెప్పాలి. పవన్ తన వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ ను పెద్దగా వినియోగించరు. ఎప్పుడో ఒకసారి ప్రాధాన్యత అనుకున్న అంశాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన వినియోగిస్తుంటారు.

జనసేన పార్టీ అధికార ట్విటర్ ఖాతాలో మాత్రం.. పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని నోట్ చేసేలా.. ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంటారు. పార్టీ ఆఫీసు ఏ రీతిలో అయితే.. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తుందో.. తాజాగా కూడా అలానే చేస్తున్నారు. కాకపోతే.. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభకు సంబంధించిన ట్వీట్లలో ఏదో మిస్ అయ్యిందన్న భావన వ్యక్తమవుతోంది. ఇందుకు తగ్గట్లే.. పార్టీ ట్విటర్ లో పోస్టు చేసిన నాలుగు ట్వీట్లలో జనసేన అధినేత ఫోటోల్లో ఫీల్ మిస్ అయిన భావన వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. జరిగిన సమాచారాన్ని ఇవ్వటమే తప్పించి.. సొంతంగా ఒక అభిప్రాయాన్ని తన మాటగా పవన్ మాట ట్వీట్ రూపంలో  రాకపోవటం ఏమిటంటారు? రత్నప్రభ అభ్యర్థిత్వానికి సంబంధించి పోస్టు చేసిన నాలుగు ట్వీట్లు మమ అన్నట్లు ఉన్నాయో కానీ మరింకేమీ లేదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుండటం గమనార్హం.
Tags:    

Similar News