పవన్ అనూహ్య నిర్ణయం..మంగళగిరిలో పోటీ

Update: 2019-03-25 05:14 GMT
అన్ని  వైపుల నుంచి విమర్శలు - టీడీపీతో  మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు వెరిసి పవన్ కళ్యాణ్ అనూహ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు - మంత్రి నారా లోకేష్ పోటీచేస్తున్న మంగళగిరి నుంచి జనసేన తరుఫున అభ్యర్థిని నిలబెడుతున్నట్టు కొద్దిసేపటికి క్రితమే ప్రకటించారు. దీంతో మంగళగిరిలో త్రిముఖ పోటీ అనివార్యమైంది.

ప్రస్తుతం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వైసీపీ తరుఫున మరోసారి బరిలోకి దిగుతుండగా.. టీడీపీ నుంచి నారాలోకేష్ బరిలోకి దిగారు. ఈ సీటును జనసేన పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించింది. సీపీఐ తరుఫున ముప్పాళ్ల నాగేశ్వరారావు నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతుండగా.. అనూహ్యంగా పవన్ జనసేన తరుఫున చల్లపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తిని మంగళగిరి బరిలో దింపింది. ఆయనకు సోమవారం భీఫాం కూడా పవన్ అందజేశారు. సోమవారం చివరి రోజు కావడంతో నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు.

జనసేన ఈ ఎన్నికల్లో వామపక్షాలు - బీఎస్పీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా టీడీపీ కీలక నేతలున్న నియోజకవర్గాలను సీపీఐకి ఇచ్చి టీడీపీకి సహకరిస్తుందన్న విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష జగన్ అయితే చంద్రబాబు పార్ట్ నర్ పవన్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో జనాల దృష్టిలో డ్యామేజ్ కాకుండా ఉండేందుకు పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.

కాగా పవన్ అనూహ్య నిర్ణయం సీపీఐకి ఝలక్ ఇచ్చినట్టైంది. సీపీఐ అభ్యర్థి నాగేశ్వరరావు దీనిపై ఫైర్ అవుతున్నారు. ఇలా తమకు కేటాయించిన స్థానాల్లో అభ్యర్థులను దింపడంపై సీపీఐ నేతలు పవన్ తో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు.
Tags:    

Similar News