గతంలో ఉత్తర ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీలో అమర్ సింగ్ - జయప్రదలు ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో కీలక నేత అయిన అమర్ సింగ్ కు జయప్రద నమ్మిన బంటుగా ఉండడం ఆ పార్టీలో మరో కీలక నేత అయిన ఆజంఖాన్ కు నచ్చేది కాదు. దీంతో, జయప్రదపై ఆజం ఖాన్ గతంలో పలుమార్లు ఇబ్బంది పెట్టారని స్వయంగా జయప్రద వెల్లడించారు. 2009లో యూపీలోని రాంపూర్ ఎంపీగా జయప్రద పోటీ చేసే సందర్భంలో ఆమెను తీవ్రంగా వేధించాడని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా - తన ఫొటోలను మార్ఫింగ్ చేసి సీడీల రూపంలో పంచిపెట్టాడని, ఆ ఘటన తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని చెప్పారు. ఆ సందర్భంగా ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసేందుకు కూడా జయప్రద యత్నించారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు
తాజాగా, మరోసారి ఆజంఖాన్ పై జయప్రద మండిపడ్డారు. ఆజం ఖాన్ ను పద్మావత్ సినిమాలోని అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రతో జయప్రద పోల్చారు. జయప్రద - ఆజం ఖాన్ ల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుదన్న సంగతి తెలిసిందే. తన పరువుప్రతిష్టలను దిగజార్చేందుకు ఆజం ఖాన్ పలు కుట్రలు చేశాడని ఆమె చాలా సార్లు ఆరోపించారు. తాజాగా, తాను పద్మావత్ సినిమా చూశానని - ఆ సినిమా చూస్తున్నంత సేపు ఖిల్జీ పాత్రలో ఆజం ఖాన్ కనిపించాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఖిల్జీ పాత్ర.....ఆజం ఖాన్ జీని గుర్తుకు తెచ్చిందని ఆమె అన్నారు. ఆజంఖాన్ కు ఖిల్జీ పాత్రకు చాలా పోలికలున్నాయని, తనను నానా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఆజం ఖాన్.....ఖిల్జీ వంటివాడని ఆమె చెప్పారు.