రామోజీ ఫిలిం సిటీ తలదన్నేలా...

Update: 2016-01-26 07:41 GMT
ఘనమైన హామీలిచ్చేసి.. ఆ తర్వాత ఊసే ఎత్తడని తెలంగాణ కేసీఆర్ కు మంచి పేరే వచ్చింది ఈ ఏడాదిన్నర పాలనలో. ఆయనిచ్చిన ఘనమైన హామీల్లో ‘హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి ఫిలిం సిటీ’ ఒకటి. ఈ హామీ ఇచ్చి ఏడాది దాటిపోయింది. ఇప్పటిదాకా ఆ దిశగా అడుగేమీ పడలేదు. మళ్లీ ఎక్కడా ఆ ఊసే ఎత్తలేదు కేసీఆర్. అంటే ఆ సంగతి గాలికొదిలేసినట్లే అనుకున్నారు. కానీ తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ మాత్రం ఫిలిం సిటీ ప్రతిపాదన పక్కకెళ్లిపోలేదని అంటున్నారు. రామోజీ ఫిలిం సిటీని తలదన్నేలా హైదరాబాద్ శివార్లలో మరో ఫిలిం సిటీ కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచ స్థాయిలో అత్యున్నత సాంకేతికతో ఏర్పాటుకానున్న ఈ ఫిల్మ్‌ సిటీ నిర్మాణంలో సినీ పరిశ్రమ భాగం పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ లో ఫిక్కీ మీడియా అండ్ ఎంటర్‌ టైన్‌ మెంట్ బిజినెస్ సదస్సులో పాల్గొన్న జయేష్ రంజన్.. బాలీవుడ్ - టాలీవుడ్ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీన్ని నిర్మూలించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్న అత్యున్నత విధానాలపై అధ్యయనం జరిపిందన్నారు. లండన్‌ లో అమలవుతున్న విధానమే అత్యున్నతమైనదని గుర్తించి, దీన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైం సెల్‌ ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. పైరసీకి పాల్పడుతున్న వెబ్‌ సైట్లు వేల సంఖ్యలో ఉంటున్నాయని, వీటిని నిలిపేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదన్నారు. వెబ్‌ సైట్లను బ్లాక్ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని తాము చేస్తున్న డిమాండ్‌ కు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దగ్గుబాటి సురేష్ బాబు - బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా - ఆస్కార్ గ్రహీత రసూల్ పొకుట్టి తదితరులు పాల్గొన్నారు.
Tags:    

Similar News