తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయం ... కౌన్సిలర్‌గా నామినేషన్ వేసిన జేసీ !

Update: 2020-03-12 13:12 GMT
తాడిపత్రి ..ఈ నియోజకవర్గానికి రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వర్గ రాజకీయాలకి పెట్టింది పేరు. జేసీ కుటుంబానికి కంచుకోట. గత కొన్నేళ్లుగా తాడిపత్రి లో జేసీ బ్రదర్స్ హవానే కొనసాగుతూ వచ్చింది. అయితే , 2019 ఎన్నికల్లో జేసీ వారసులు అనంతపురం ఎంపీ గా , తాడిపత్రి ఎమ్మెల్యే గా బరిలో నిలిచి ఓటమిపాలైయ్యారు. ఇది జేసీ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బ. ఇక వైసీపీ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల సమయం లో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లతో ఇక పోటీ చేయటం కష్టమని, తాము తమ అభ్యర్ధులను పోటీలో పెట్టమని ప్రకటించారు.

అయితే , తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. తాను బాధ్యతలు నిర్వహించిన పదవి కంటే తక్కువ పదవికి నామినేషన్ వేసి షాకిచ్చారు. తాడిపత్రి మున్సిపాలిటీ 30వ వార్డుకు కౌన్సిలర్ గా ప్రభాకర్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే , అదే 30 వ వార్డ్ నుండి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో అక్కడి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. దీనితో మరోసారి తాడిపత్రి రాజకీయం రాష్ట్ర వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం తాడిపత్రి లో వైసీపీ బలంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గతంలో మున్సిపల్ ఛైర్మన్ గా ..తాడిపత్రి ఎమ్మెల్యేగా పని చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. అయితే , అయన కౌన్సిలర్ గా నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం...తన పైన ఎమ్మెల్యేగా గెలిచిన పెద్దారెడ్డి కుటుంబం నుండి మరెవరూ ఏ ఎన్నికల్లోనూ గెలవకూడదని, అలాగే తాడిపత్రిలో తన బలం ఏంటో చూపించడానికే ఈ నామినేషన్ దాఖలు చేయించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. అయితే , ఒకవైపు జేసీ దివాకర్ రెడ్డి ..ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు అని ప్రకటించారు. అయితే అయన నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గా నామినేషన్ వేయడం తో , దీనిపై అయన ఈ విదంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News