మోడీ హ‌త్య‌కు గ‌డ్క‌రీ స్కెచ్‌..ట్వీట్ వైర‌ల్‌

Update: 2018-06-10 10:59 GMT

మాజీ ప్ర‌ధాని రాజీవ్‌ గాంధీ తరహాలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని హత్య చేయడానికి మావోయిస్టులు కుట్ర పన్నుతున్నారని పుణె పోలీసులు వెల్లడించిన  అంశం ఇంకా క‌ల‌క‌లం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. గత జనవరిలో జరిగిన భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్గార్ పరిషత్ అనే సంస్థకు చెందిన దళిత కార్యకర్త - పబ్లిషర్ సుధీర్ ధవాలే - మానవహక్కుల కార్యకర్త - న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్ - గిరిజన హక్కుల కార్యకర్త మహేశ్ రౌత్ - నాగ్‌ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ షోమాసేన్ - ఢిల్లీకి చెందిన హక్కుల కార్యకర్త రోనా విల్సన్‌ లను పోలీసులు బుధవారం అరెస్టుచేశారు. వీరిలో ఓ నిందితుడి ఇంట్లో దొరికిన అంశం ఆధారంగా మోడీ హ‌త్య స్కెచ్ తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే ఈ ఎపిసోడ్‌ పై జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి నేత షెహ్లా రషీద్ చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.

ప్ర‌ధాని మోడీని ఆరెస్సెస్ - గడ్కరీనే రాజీవ్‌ గాంధీ తరహాలో హత్య చేయాలనుకుంటున్నారని, ఆ నిందను ముస్లింలపై మోపి వాళ్లపై దాడులు చేయాలని చూస్తున్నారంటూ విద్యార్థి నేత షెహ్లా రషీద్ ఓ వివాదాస్పద ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ వైర‌ల్ అయింది. దీనిపై తీవ్రంగా మండిపడిన కేంద్ర‌మంత్రి గడ్కరీ.. షెహ్లాపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అయితే దీనిపై షెహ్లా స్పందిస్తూ.. తాను వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశానని చెప్పుకొచ్చారు. ``ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీకి చెందిన నేత నేను చేసిన ఓ వ్యంగ్య ట్వీట్‌ పై ఇలా స్పందించారు. మరి ఉమర్ ఖాలిద్ అనే ఓ విద్యార్థి నేతలపై మీడియా ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తున్న దాడిని ఏమనాలి?  వాళ్లపై కూడా గడ్కరీ చర్యలు తీసుకుంటారా? అంటూ మరో ట్వీట్‌ లో ఆమె ప్రశ్నించింది.

కాగా, మోడీని హత్య చేయబోతున్నారన్న వార్తలపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ఇదంతా బీజేపీ నాటకమని కాంగ్రెస్ విమర్శించింది.ఈ కథనాలు పూర్తిగా అవాస్తవం కాకపోవచ్చు. కానీ, తనకు ప్రజాదరణ తగ్గిన ప్రతిసారీ మోదీ హత్యకు కుట్రపన్నుతారనే కథనాలు వచ్చేవి. ఈ కథనాల్లో వాస్తవం ఎంతనే విషయాన్ని దర్యాప్తు ద్వారా నిగ్గుతేల్చాలి అని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ విమర్శించారు. మోదీ హత్యకు కుట్ర జరిగిందనే అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, త్వరలోనే వాస్తవాలు వెలుగుచూస్తాయని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. మరోవైపు అంబేద్కర్‌ వాదులు ఎప్పటికీ నక్సల్స్ కాలేరని, -నక్సల్స్ ఎప్పటికీ అంబేద్కర్‌ వాదులు కాలేరని కేంద్రమంత్రి రాందాస్ అథవలే వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News