హిజాబ్ వేసుకోను తేల్చిన జర్నలిస్టులు.. ఇంటర్వ్యూ ఇవ్వని ఇరాన్ అధ్యక్షుడు

Update: 2022-09-23 08:07 GMT
హిజాబ్ తప్పనిసరి.. లేకుంటే చర్యలు తీసుకుంటామనే దేశంలో ఇప్పుడు హిజాబ్ మీద రేగుతున్న నిరసనలు అన్ని ఇన్ని కావు. గతానికి భిన్నంగా ఇరాన్ మహిళలు చైతన్యంతో హిజాబ్ ఇష్యూలో తమ నిరసన గళాన్ని వినిపిస్తున్న వేళ..

అంతర్జాతీయంగా చోటు చేసుకున్న ఒక పరిణామం ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. కొత్త చర్చకు తెర తీసేలా మారింది. తమ దేశంలో హిజాబ్ ఇష్యూ హాట్ హాట్ గా సాగుతున్న వేళ.. ఐక్యరాజ్య సమితి జనరల్ బాడీ మీటింగ్ లో ప్రసంగించేందుకు న్యూయార్కు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసిని ఇంటర్వ్యూ చేసేందుకు సీఎన్ఎన్ సీనియర్ మహిళా జర్నలిస్టు.. పాత్రికేయ దిగ్గజంగా చెప్పుకునే 64 ఏళ్ల క్రిస్టియానే అమన్ పౌర్  ప్రయత్నించగా.. అందుకు ఇరాన్ అధ్యక్షుల వారు ఒప్పుకున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుల వారి తరఫు నుంచి ఒక ముఖ్య అధికారి మహిళా జర్నలిస్టు వద్దకు వచ్చి..అధ్యక్షుల వారిని ఇంటర్వ్యూ చేసే వేళలో.. హిజాబ్ వేసుకోవాలని కోరారు. అందుకు ఆమె అంతే సూటిగా నో చెప్పారు. అంతేకాదు.. గతంలో ఏ ఇరాన్ అధ్యక్షుడు.. విదేశాల్లో ఇంటర్వ్యూ ఇచ్చిన వేళలో ఇలాంటి షరతును విధించటం చూడలేదు కాబట్టి తాను హిజాబ్ ధరించలేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్న విషయాన్నిప్రస్తావించి.. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అయినా.. అధ్యక్షుల వారి ఆలోచనలకు తగ్గట్లు హిజాబ్ లేదంటే తలకు కప్పేస్తూ ఏదైనా వస్త్రాన్ని చుట్టుకోవాలని సూచన చేశారు. అందుకు ఆమె ససేమిరా అనటంతో సిబ్బందితో సహా వెళ్లిపోయారు ఇరాన్ అధ్యక్షుల వారు. దీంతో.. స్టూడియోలోని ఖాళీ ఛైర్ సెట్ ఎదుట కూర్చున్న ఆమె.. జరిగిన పరిణామాల్ని పేర్కొంటూ వరుస పోస్టులు పెట్టారు. ఇరాన్ అధ్యక్షుడి తీరును తప్పు పడుతూ.. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె అందులో వివరించారు.

ఇక్కడ మహిళా జర్నలిస్టు అమన్ పౌర్ గురించి కొంత చెప్పాలి. ఆమె పుట్టింది లండన్ లో అయినా.. ఆమె తండ్రి మొహమ్మద్ తఘీ ఇరాన్ వాసి. ప్రస్తుతం సీఎన్ఎన్ కు చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్ గా పని చేస్తున్న ఆమెకు చాలా మంచి పేరుంది.

ఈ కారణంతోనే ఆమెకు ఇంటర్వ్యూ ఇవ్వటానికి ఇరాన్ అధ్యక్షుల వారు సిద్ధమయ్యారు కానీ.. ఈ ఇంటర్వ్యూతో జర్నలిస్టు చేత హిజాబ్ ధరించేలా చేసి.. తాను ఇవ్వాల్సిన సందేశాన్నిఇచ్చే ప్రయత్నం చేస్తే.. దాన్ని అడ్డుకున్న అమన్ పౌర్.. ఇరాన్ అధ్యక్షుల వారి తీరును ఎండకడతూ చేసిన పోస్టులతో ఇరాన్ అధ్యక్షులు వారి ఇమేజ్ ను దెబ్బ తీసిందని చెప్పక తప్పదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News