చినబాబు టచ్ లో ఎక్స్ తమ్ముళ్లు

Update: 2016-07-29 07:26 GMT
సైకిల్ దిగేసి.. కారు ఎక్కేసిన తెలుగు తమ్ముళ్లు తెలుగుదేశం పార్టీ ముఖ్యలతో తరచూ టచ్ లో ఉంటున్నారా? టీడీపీ అగ్రనాయకత్వంతో మాట్లాడేందుకు తహతహలాడుతున్నారా? తమ అధినేత గురించి వాపోతున్నారా? ఇలాంటి ప్రశ్నలెన్నో కలిగేలా ఏపీ ముఖ్యమంత్రి కుమారుడు.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక ఆసక్తికర ముచ్చట చెప్పుకొచ్చారు. ఆ మధ్యన పార్టీ నుంచి వెళ్లిపోయి గులాబీ కారు ఎక్కేసిన ఒక నేత తనకు తరచూ ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. తాను ఎందుకులే అని ఫోన్ఎత్త లేదని.. మస్తుసార్లు చేయటంతో సర్లే మాట్లాడదామని ఒకసారి ఫోన్ ఎత్తినానని చెప్పిన లోకేశ్ ఆ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణను చెప్పుకొచ్చారు.

ఏమన్నా.. బాగున్నావా? అని అడిగితే..‘‘ ఏం బాగున్నమన్నా.. ఇక్కడేం బాగోలేదు..పార్టీలో చేరే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ నాతో మూడు గంటలు మాట్లాడిండు. చేరినప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చిండు. మళ్లీ ఇప్పటి వరకూ కలవనియ్యలే’’ అని చెప్పారన్నారు.

మరి.. మీ ఇంఛార్జ్ మంత్రితో చెప్పుకోకపోయావా? అని అడిగానని.. దీనికి బదులిచ్చిన ఆ నేత.. ఆ ముచ్చట కూడా అయ్యిందని.. తాను వెళ్లి తన ఇంఛార్జ్ మంత్రితో తన గోడును వెళ్లబోసుకుంటే తనకు షాక్ తగిలేలా ఆయనో మాట చెప్పినట్లుగా చెప్పిన లోకేశ్.. ‘‘అన్నా నీకు నోరున్నది నాకు చెప్పుకున్నవు. నేను మంత్రిని. నాకు నోరు లేదు. నేను ఎవరికీ చెప్పుకోలేను’’ అంటూ బదులిచ్చినట్లుగా తనకు చెప్పినట్లుగా లోకేశ్ వెల్లడించారు.

లోకేశ్ మాటల్ని చూస్తే.. ఈ ముచ్చట చెప్పిన నేత ఎమ్మెల్యేగా చెప్పొచ్చు. మరి.. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేతో తరచూ టచ్ లో ఉండలేరు కదా. అంతదాకా ఎందుకు ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు పార్టీలో చేరారు. మరి.. వారిలో ఎంతమందితో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ టచ్ లో ఉంటున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. అయినా.. టీఆర్ఎస్ లోకి చేరిన నేత.. లోకేశ్ కు టచ్ లో ఉన్నారన్న విషయం గాలి వార్తగా కేసీఆర్ అండ్ కోకు తెలిసినా.. పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని.. తాజాగా చినబాబు మాట పుణ్యమా అని రేపట్నించి టీటీడీపీ నుంచి జంప్ అయి వచ్చిన నేతల మీద స్పెషల్ ఫోకస్ ఉంటుందని చెబుతున్నారు. ఉదాహరణ అంటూ లోకేశ్ చెప్పిన మాట కారు ఎక్కిన తమ్ముళ్లు కొత్త తలనొప్పి తీసుకురావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News